
గర్మిళ్ల, నవంబర్ 11 : పోలీస్ వాహనాల డ్రైవర్లు క్రమశిక్షణ, సమయపాలన, వృత్తి నిబద్ధత, విధేయత కలిగి ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు. గురువారం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని డ్రైవర్లకు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా పోలీస్ వ్యవస్థకు భంగం కలిగే విధంగా ప్రవర్తిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. . బాధ్యత, నిజాయితీ, పారదర్శకత జవాబుదారీగా ఉండాలని తెలిపారు. వాహనాన్ని ప్రభుత్వ పనులకే వాడాలని, సొంత పనులకు వాడినా, సివిలియన్స్‌కు ఇచ్చినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ అడ్మిన్ అశోక్ కుమార్, ఏఆర్ ఏసీపీ సుందర్ రావు, మల్లికార్జున్, మంచిర్యాల ఎంవీఐ వివేకానందరెడ్డి, పెద్దపల్లి ఎంవీఐ శ్రీనివాస్, ఎంటీవోలు మధూకర్, అంజన్న, ఆర్ఐ శ్రీధర్, విష్ణు ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
ఎస్ఐ కుటుంబానికి సాయం
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పని చేస్తూ కరోనాతో మృతి చెందిన ఎస్ఐ జహీరొద్దీన్ కుటుంబానికి మ్యాన్ కైండ్ ఫార్మా ద్వారా గురువారం రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి రూ.3 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్ అమర వీరుల త్యాగాలను స్మరిస్తూ వారి కుటుంబాలను మ్యాన్ కైండ్ ఫార్మా చేస్తున్న సాయాన్ని అభినందించారు. మ్యాన్ కైండ్ ఫార్మా ప్రతినిధులు మాట్లాడుతూ కరోనా మహమ్మారిపై పోరాడి ప్రజా రక్షణలో ప్రాణాలు కోల్పోయిన యోధుల కుటుంబాలను ఆదుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మ్యాన్ కైండ్ ఫార్మా డివిజన్ జోనల్ మేనేజర్ సమీర్ కుమార్, డీ సుధాకర్, రీజనల్ మేనేజర్లు భగవాన్‌రెడ్డి, జీ శ్రీనివాస్, కృష్ణ కిశోర్ పాల్గొన్నారు.