
ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వ విప్ బాల్క సుమన్
చెన్నూర్, జనవరి 11: ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని, మహిళలు స్వయం కృషితో ఆర్థికాభివృద్ధి సాధించాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. చెన్నూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం పలుశాఖల అధికారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులతో సెర్ప్, మెప్మా కార్యకలాపాలపై నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో సుమారు రూ.15 కోట్ల తో చెన్నూర్ నియోజకవర్గంలో 102 గ్రామాల్లో 102 సమ్మక్క – సారలమ్మ మహిళా భవనాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు వివిధ రంగాల్లో నిపుణులైన వారితో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మహిళల అభ్యున్నతిలో రాష్ట్రంలోనే గొప్ప నియోజకవర్గంగా చెన్నూర్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. సంఘాల సభ్యులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేసి ప్రజలకు మెరుగైన సేవలందించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న సెర్ప్, మెప్మా సిబ్బంది సేవలను ఆయన ప్రశంసించారు. ఈ సమావేశంలో డీఆర్డీవో శేషాద్రి, చెన్నూర్ ఎంపీపీ మంత్రి బాపు, జడ్పీటీసీ మోతె తిరుపతి, చెన్నూర్, మందమర్రి, క్యాతన్‌పల్లి మున్సిపల్ కమిషనర్లు ఖాజా ఖంరొద్దీన్, రాజు, వెంకట నారాయణ, చెన్నూర్, కోటపల్లి, భీమారం, జైపూర్, మందమర్రి ఎంపీడీవోలు మల్లేశం, భాస్కర్, శ్రీనివాస్, నాగేశ్వర్‌రెడ్డి, ప్రవీణ్, డీపీఎం, నియోజకవర్గంలోని ఏపీఎంలు, సీసీలు, వీవోఏలు, ఆర్పీలు, టీఎంసీ సభ్యులు పాల్గొన్నారు.
మిషన్ భగీరథ పనులను వేగవంతం చేయాలి
రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని చెన్నూర్ నియోజకవర్గంలో మిషన్ భగీరథ పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆదేశించారు. చెన్నూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మిషన్ భగీరథ పనులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎండకాలం నాటికి పనులు తాగునీరందించాలని అధికారులను ఆదేశించారు. సమస్యలుంటే తెలుపాలన్నారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఈఈ అంజన్‌రావు, ఏఈలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
వినతి పత్రం అందజేసిన ఉపాధ్యాయులు
అంతర్ జిల్లా స్పౌజ్ బదిలీలకు సంబంధించి మంచిర్యాల జిల్లాను బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించాలని కోరుతూ చెన్నూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌కు మంగళవారం ఉపాధ్యాయులు వినతి పత్రాన్ని అందజేశారు. ఇందుకు ఆయన స్పందించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో ఫోన్లో మాట్లాడి ఉపాధ్యాయుల సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.
సిద్దిపేట కోమటి చెరువు పరిశీలన
మందమర్రి జనవరి 11.సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటి చెరువుపై సస్పెన్షన్ బ్రిడ్జి, రాక్ గార్డెన్, గ్లో గార్డెన్, నెక్లెస్ రోడ్‌తో పాటు ట్యాంక్‌బండ్ సుందరీకరణ పనులను చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మంగళవారం పరిశీలించారు. సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇదే తరహాలో చెన్నూర్ నియోజక వర్గం పరిధిలోని చెరువులను సుందరంగా తీర్చిదిద్దేందుకు కోమటి చెరువును సందర్శించినట్లు ఆయన తెలిపారు.