
ఘనంగా గురుకృప దివస్
పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
ఆకట్టుకున్న సాంస్కృతిక నృత్యాలు
నార్నూర్, జనవరి 11: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం కొత్తపల్లి(హెచ్)తండాలోని జాతీయ దీక్షభూమి ఆలయంలో మంగళవారం గురు,శిష్యుల (మిలాన్ దివ స్) 43వ గురుకృప దివస్‌ను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. లంబాడాల ఆరాధ్యదైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్, జగదంబాదేవి, ధర్మ గురువు రాష్ట్రీయ సంత్ మహాన్ తపస్వీ రాంరావ్ మహారాజ్‌కు పూజలు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో దీక్షభూమి ఆధ్యాత్మిక పరిమళాన్ని సంతరించుకున్నది. భజనలు, కీర్తనలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. అంతకుముందు లంబాడాలు గంగాపూర్ నుంచి శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్ పల్లకీతో శోభాయాత్ర నిర్వహించారు. సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. దీక్షగురువు ప్రేమ్‌సింగ్ మహారాజ్ భోగ్ భండార్ నిర్వహించారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాలను అలవర్చుకోవాలని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. ఆలయ కమిటీ సభ్యులు కొవిడ్ మాస్కులు పంపిణీ చేశారు. మాజీ ఎంపీలు వివేక్, రాథోడ్ రమేశ్, సర్పంచ్ రాథోడ్ సుభద్రాబాయి రామేశ్వర్, మాజీ సర్పంచ్ చౌహాన్ దిగంబర్, ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు.