
పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం
స్తంభాలు పడిపోయి నిలిచిన విద్యుత్ సరఫరా
రోడ్లపై చెట్లు విరిగిపడి రాకపోకలకు అంతరాయం
లేచిపోయిన ఇళ్ల పై కప్పు రేకులు తెగిన గుండి వాగు వంతెన
పలుచోట్ల పత్తి, మిర్చి, మక్క, కంది, శనగ పంటలకు నష్టం
మంచిర్యాల, జనవరి 11, నమస్తే తెలంగాణ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం గాలివాన బీభత్సం సృష్టించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి కారణంగా పలుచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడగా, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అక్కడక్కడా వడగండ్లు పడ్డాయి. పల్లెల్లో స్తంభాలు పడిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చెట్లు విరిగి రోడ్లపై పడడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. పత్తి, మక్క, కంది, శనగ, మిర్చి, తదితర పంటకు నష్టం వాటిల్లగా, అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం మోస్తరు వర్షం కురిసింది. వానకాలం నుంచి ఇప్పటి వరకు మంచిర్యాల జిల్లావ్యాప్తంగా దాదాపు 1,180 మిల్లీమీటర్లు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 1,490 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జన్నారం మండలంలో అత్యధికంగా 21.2 మి.మీటర్లు, ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండలంలో 50 మి.మీ వర్షం కురిసింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో మరో నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. కంది పంట కోత దశలో ఉన్న రైతులు ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కోతలను వాయిదా వేసుకోవడం మంచిదని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. శనగ వంటి పంటల్లో వర్షాలు ఆగిన తర్వాత నేలలోని నీటి తడిని వినియోగించుకుంటూ కొద్ది మోతాదులో నత్రజని, పొటాష్ ఎరువులను వేసుకుంటే పంటకు పోషకాలు సరిగా అంది ఎదుగుదల బాగుంటుంది. బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలను, ముందస్తు వాతావరణ సమాచారాన్ని పొందేందుకు 8309357311లో సంప్రదించాలని శాస్త్రవేత్త డాక్టర్ సతీశ్ కుమార్ సూచించారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ..
కుమ్రం భీ ఆసిఫాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఉదయం 7 నుంచి 11 గంటల వరకు ఉరుములతో కూడిన వాన పడింది. ఆసిఫాబాద్ మండలంలోని గుండి వాగుపై ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోవడంతో గుండి గ్రామానికి రాకపోకలకు అంతరాయం కలిగింది. పెంచికల్పేట్ మండలం లోడ్పల్లి, కొండపల్లిలో రాళ్ల వర్షం కురిసింది. ఎల్లూర్ గ్రామానికి చెందిన ఖలీల్బేగ్ పెరటిలో ని చింత చెట్టు కూలడంతో రేకుల షెడ్, బాత్రూం నేలమట్టమైంది. దహెగాం మండలంలో పలుచోట్ల స్తంభాలు నేలకూలాయి.ట్రాన్స్కో అధికారులు మరమ్మతు చేపట్టి సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. జిల్లాలో సరాసరిగా 14.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పత్తి, కంది, కూరగాయల పంటలకు నష్టం కలిగింది. ముఖ్యంగా జిల్లాలో కంది పంట చేతికి వస్తున్న సమయంలో అకాల వర్షాలతో తీవ్రనష్టం కలుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది అధిక వర్షాలతో పత్తి పంటకు నష్టం కలిగి దిగుబడి తగ్గిపోయింది.
నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో..
కుంటాల, జనవరి 11 : కుంటాల మండలం పెంచికల్పాడ్, విఠాపూర్లో మక్కజొన్న నేలవాలింది. మిర్చి రాలిపోయింది.
దస్తురాబాద్, జనవరి11 : దస్తురాబాద్ మండలం రేవోజిపేట, మున్యాల, బుట్టాపూర్లో రాళ్ల వర్షం కురిసింది. మున్యాల, బుట్టాపూర్, మున్యాల తండా, రేవోజిపేట, గొడిసెర్యాలలో మొత్తం ఏడు రేకుల ఇండ్లు కూలాయి. మల్లాపూర్, రేవోజిపేటలో 17 విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్, మున్యాలలో 11 కేవీ విద్యుత్ లైన్లు నేలకొరిగాయి. ట్రాన్స్కో ఏఈ కేశెట్టి శ్రీనివాస్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ను పరిశీలించారు. కూలిన ఇండ్లను ఆర్ఐలు గంగన్న, పీవీ నర్సయ్య పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. సర్పంచ్లు దుర్గం శంకర్, సీదర్ల భూమేశ్, ట్రాన్స్కో సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
గుడిహత్నూర్,జనవరి11:గుడిహత్నూర్ మండలంలో 46.2మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు తహసీల్దార్ పవన్చంద్ర తెలిపారు. పలు పంటలకు నష్టం వాటిల్లింది.
కడెం, జనవరి 11: పెద్దూర్తండాలో ఇస్లావత్ శేఖర్ అనే వ్యక్తికి చెందిన 3 లక్షల ఇటుక వర్షానికి తడిసింది. రూ. 9 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లోని పంటలకు నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు.
బజార్హత్నూర్, జనవరి 11: బజార్హత్నూర్ మండలం భూతాయి, దేగామ, బజార్హత్నూర్, కాండ్లీ, కొల్హారి, జాతర్ల తదితర గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద భారీగా వచ్చి చేరింది. చేతికి వచ్చిన పంటలు కాత, పూత రాలిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
భైంసా, జనవరి 11 : భైంసాలో తెల్లవారు జామున దాదాపు గంటన్నర పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. చేతికొచ్చిన పంటలు నష్టపోవాల్సి వచ్చిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఉట్నూర్, జనవరి 11: ఉట్నూర్లో కంది పంటను కోసి కుప్పలుగా పోయగా అకాల వర్షానికి తడిశాయి. శనగ,జొన్న పంటలకు నష్టం వాటిల్లింది.