
జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు..
మార్లవాయిలో సంప్రదాయబద్ధంగా 35వ వర్ధంతి
హాజరైన ఐటీడీఏ పీవో, అదనపు కలెక్టర్, ప్రముఖులు..
జైనూర్, జనవరి 11 : ప్రొఫెసర్ హైమన్‌డార్ఫ్-బెట్టి ఎలిజబెత్ దంపతులను ఆదివాసీ సమాజం మరువదని, వచ్చే యేడాది వర్ధంతిని అధికారికంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్ పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేర్కొన్నారు. మంగళవారం జైనూర్ మండలంలోని మార్లవాయి గ్రామంలో ఆదివాసుల సంప్రదాయబద్ధంగా డార్ఫ్ దంపతుల 35వ వర్ధంతి నిర్వహించగా.. జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్‌రెడ్డి, ఐటీడీఏ పీవో అంకిత్‌కుమార్‌తో కలిసి హాజరయ్యారు. ముందుగా గ్రామ పటేల్ ఇంటి నుంచి కాలినడకన, డప్పుచప్పుళ్ల మధ్య గ్రామ పొలిమేరలో ఉన్న డార్ఫ్ దంపతుల సమాధుల వద్దకు వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించి, విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. కుమ్రం భీం విగ్రహానికి కూడా పూలమాలలు వేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఐటీడీఏ పీవో అంకిత్, అదనపు కలెక్టర్ వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ.. మార్లవాయిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుదామని పేర్కొన్నారు. త్వరలో త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేపడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరీబాయి, పద్మశ్రీ అవార్డు గ్రహీత కనక రాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్‌రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆత్రం భగవంత్‌రావు, ఎంపీపీ కుమ్ర తిరుమల, వైస్ ఎంపీపీ చిర్లె లక్ష్మణ్, సహకార సంఘం చైర్మన్ కొడప హన్ను పటేల్, తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్రం శంకర్, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు ఇంతియాజ్‌లాల, సర్పంచ్‌లు కనక ప్రతిభ, పార్వతీ లక్ష్మణ్, మడావి భీంరావు, నాగోరావు, శ్యాంరావు, రాహుల్, గోవింద్రావు, ఎంపీటీసీ భగవంత్‌రావు తదితరులున్నారు.