
పలుచోట్ల ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ర్యాలీలు
జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తిన వీధులు
ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకాలు
పాల్గొన్న ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు
ఉమ్మడి జిల్లాకు రూ.874.93 కోట్లు..
ఇప్పటికే 80 శాతం మేర జమ
ఆదిలాబాద్, జనవరి 10 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘రైతుబంధు’తో తమకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్‌కు అన్నదాతలు జై కొడుతున్నారు. రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా సోమవారం ఎనిమిదో రోజూ సంబురాలు జరుపుకున్నారు. పలుచోట్ల ఎమ్మెల్సీ దండే విఠల్, జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు రైతులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీలు తీశారు. ‘జై కేసీఆర్.. జైజై రైతుబంధు’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. అక్కడక్కడా ముగ్గులు, చిత్రలేఖనం పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కాగా,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 5,94,059 మంది రైతులకు రూ.874.93 కోట్లు అందించనుండగా, ఇప్పటికే 80 శాతం మేర డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతుబంధు సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. సోమవారం ఎనిమిదో రోజూ రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొని సీఎం కేసీఆర్ చిత్ర పటాలకు పాలాభిషేకాలు చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు రైతులు, స్థానిక నేతలతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. భోగి మంటలు వేశారు. మిఠాయిలు పంపిణీ చేశారు. పటాకులు పేల్చారు. మంచిర్యాల ఎంబ్లమ్ వద్ద మహిళలు ముగ్గులు వేసి అలంకరించారు. దండేపల్లి మండలం పాతమామిడిపెల్లి, లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేటలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాసిపేట, కన్నెపల్లి మండల కేంద్రాల్లో ఎమ్మెల్యే దుర్గం రైతులు, ప్రజాప్రతినిధులతో కలిసి చిన్నయ్య ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీ తీశారు. ఆయా చోట్ల ఎడ్ల బండి నడిపి ఉత్సాహ పరిచారు. నెన్నెల మండల కేంద్రంలోని హన్మాన్ టెంపుల్ నుంచి కుష్నపల్లి రోడ్డు వరకు ట్రాక్టర్ నడిపి ర్యాలీని ప్రారంభించారు. ఆయన వెంట జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ ఉన్నారు. కాగా, చెన్నూర్ నియోజకవర్గంలో నేడు తలపెట్టాల్సిన ట్రాక్టర్ ర్యాలీని 12వ తేదీకి వాయిదావేశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి కుమ్రం భీం చౌక్, అంబేద్కర్ చౌక్, సాయిబాబా ఆలయం గుండా జన్కాపూర్‌లోని రైతు వేదిక వరకు జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీ తీశారు.
జై తెలంగాణ.. జై రైతుబంధు.. జైజై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు. కౌటాల మండల కేంద్రంతో పాటు కాగజ్‌నగర్ మండలం నజ్రుల్‌నగర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన సంబురాల్లో ఎమ్మెల్సీ దండె విఠల్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జడ్పీ వైస్ చైర్మన్‌తో కలిసి పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. చింతలమానేపల్లి మండలం బాలాజీ అన్కోడా, డబ్బా, రుద్రాపూర్ రైతు వేదికల్లో నూ పాల్గొన్నారు. జైనూర్‌లో రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు ఇంతియాజ్‌లాల, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్‌రావు ఎడ్లబండి, ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే రేఖానాయక్ రైతులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నార్నూర్ మండల కేంద్రంలో ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మ న్ రాథోడ్ జనార్దన్ రైతులతో కలిసి ఎడ్లబండ్ల ర్యాలీ తీశారు. నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి ఎడ్లబండ్ల ర్యాలీలో పాల్గొన్నారు. వృద్ధులు, రైతులతో కలిసి ఎమ్మెల్యే డీజే పాటలకు నృత్యం చేశారు. అనంతరం చిత్రలేఖనం పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.
అన్నదాతల ఖాతాల్లో రూ.874.93 కోట్లు ..
ఉమ్మడి రాష్ట్రంలో దండుగలా ఉన్న వ్యవసాయాన్ని ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం పండుగలా మార్చింది. ఈ మేరకు ఏటా రెండు సీజన్లలో రైతుబంధు పథకం ద్వారా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నది. ఎకరాకు రూ.5 వేల చొప్పున అందజేస్తున్నది. ఈ సీజన్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత నెల 25 నుంచి రైతుబంధు డబ్బులు జమ చేస్తున్నది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.50 వేల కోట్లు అందజేసింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 5,94,059 మంది రైతులకుగానూ ప్రభుత్వం రూ.874.93 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నది. ఆదిలాబాద్ జిల్లాలోని 1,48,818 మంది రైతులకు రూ.277.26 కోట్లు, నిర్మల్ జిల్లాలో 1,78,535 మంది రైతులకు రూ. 226.29కోట్లు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 1,19,165 మంది రైతులకు రూ. 201. 63 కోట్లు, మంచిర్యాల జిల్లాలో 1,47,541 మంది రైతులకు రూ.169.75 కోట్లును అందజేస్తున్నది. ఇప్పటికే 80 శాతం మేర డబ్బులు ఖాతాల్లో జమ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
గల్ఫ్ పోక ఇక్కడే ఎవుసం జేత్తన్న..
నా పేరు పొరుగంటి దత్తు. నా భార్య అనసూయ. మాది నిర్మల్ జిల్లా సోన్ మండలం న్యూవెల్మల్ గ్రామం. నాకు మూడెకరాల భూమి ఉంది. గతంల బాకీలు తెచ్చి విత్తనాలు, మందులు తెచ్చేటోన్ని. పంట దిగుబడి అంతంతే అచ్చేటియి. పెట్టుబడికి పెట్టిన పైసలు కట్టుడు అయిపోయేసరికి చేతిల గవ్వ కూడా మిగలకపోతుండే. నాకు ఇద్దరు కొడుకులు. వాళ్లను మంచిగ చదివియ్యాల్నని దుబాయికి పోయిన. ఆడనే రెండేండ్లు ఉన్న. పని దొరకక సానా ఇబ్బంది పడ్డా. తెలంగాణల రైతులకు ముఖ్యమంత్రి సారు పెట్టుబడి పైసలు ఇస్తున్నడని తెలిసి, ఈడికి వద్దామని అనుకున్న. ముందుగాల నా భార్యకు చెప్పిన. ఆమె ఈడ్నే నాలుగు రాళ్లు సంపాదించుకుందాం. దేశం కాని దేశంల ఇబ్బందులు పడద్దు అని బాధ పడ్డది. ఇగ ఆడ ఉండలేక వచ్చేసిన. నాకున్న మూడెకరాలకు ఒక్కో విడుతకు రూ.15 వేలు అస్తున్నాయి. ఈ పైసలతోనే విత్తనాలు, మందులు తెచ్చి పెట్టా. పల్లి, పెసర, పసుపు వేస్తున్న. నాకే కాద.. అమ్మానాన్నలకు నెలనెలా పింఛన్ ఇస్తున్రు. నా కొడుకుల సదువులకు ఇబ్బంది లేకుంటయ్యింది. గతంల ఇట్లా లేకుండే. కేసీఆర్ సారు అచ్చినంక అంతా మారింది. గిట్లయితదని కలల కూడ అనుకోలె. నాకైతే ఎంతో సంబురమనిపిస్తంది. వేరే దేశంలో పడ్డ ఇబ్బందులు గుర్తొచ్చి ఒక్కోసారి బాధనిపిస్తది. ఇప్పుడు అవన్నీ పోయి మన రాష్ట్రంల.. మన ఊళ్ల ఉండి పని చేసుకుంటున్నందుకు ఎంతో సంబురమైతంది. కేసీఆర్ సారు ఉన్నంత కాలం రైతులకు ఢోకా లేదు. – సోన్, జనవరి 10
విత్తనాలు కొన్న
నాపేరు వెడ్మ దేవ్‌రావ్. మాది ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని టేకిడిగూడ. నాకు రెండెకరాల ఎవుసం భూమి ఉంది. యేడాదికి రెండు పంటలకు రూ.20 వేలు వస్తున్నాయ్. ఆనకా లంలో పత్తి, సోయా వేస్తా. యాసంగిలో గోధుమ, జొన్న, శనగ పండిస్తున్నా. రైతుబంధు పైసలు రాకముందు వడ్డీ వ్యాపారుల వద్దనే పైసలు తీసుకొని విత్తనాలు, ఎరువులు కొనేది.. ప్రభుత్వం రైతుబంధు పైసలు వేస్తున్నప్పుటి నుంచి డబ్బుల గురించి ఎలాంటి భయం లేదు. సీఎం సార్ ఇచ్చిన పైసలతోనే విత్తనాలు కొంటున్నా. – ఇంద్రవెల్లి, జనవరి 10
బోరేయించిన..
నా పేరు కనక లంకు. నేను ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం తుమ్మగూడలో ఉంట. నా పేరిట మూడున్నరె కరాలు ఉంది. ఆనకాలం పత్తి, సోయా ఏసిన. ఈ యసం గిల జొన్న, పల్లి, మక్క, గోధుమేసిన. నాలుగేండ్లుగా సీఎం కేసీఆర్ రైతుబంధు డబ్బులిస్తున్నడు. పంటకు రూ.17,500 చొప్పున యేటా రూ.35 వేలు వస్తున్నయ్. ఈ యాసంగికి గూడా డబ్బులచ్చినయ్. గతేడాది కొత్తలతో బోరేయించిన. పైసలియ్యడం సంతోషంగుంది. – ఇంద్రవెల్లి, జనవరి 10