
దళితబంధుకు 20వేల కోట్లతో బడ్జెట్
నియోజకవర్గానికి 100 మంది ఎంపిక
సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ముందంజ
మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
నిర్మల్ టౌన్, జనవరి 10 : ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన దళిత కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ నాయకత్వంలో రూపొందించిన దళితబంధు పథకానికి రూ.20 వేల కోట్ల బడ్జెట్ కేటాయించనున్నట్లు రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. నిర్మల్ కలెక్టరేట్లో సోమవారం ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీతో కలిసి దళతబంధు పథకంపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో నియోజకవర్గానికి 100 మంది చొ ప్పున దళితబంధు కోసం ఎంపిక చేసి రూ.10 లక్షల సాయం అందించనున్నట్లు చెప్పారు. జిల్లాలో సంక్రాంతి తర్వాత లబ్ధిదారుల ఎంపిక చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా జనాభాలో 15 శాతం దళితులున్నారని పేర్కొన్నారు. నిరుద్యోగ యువతీయువకులు విభిన్న ఉపాధి అవకాశాలను ఎంచుకొని ఆర్థిక స్వావలంభన సాధించాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర బడ్జెట్‌కు ప్రతిపాదనలు పంపండి..
మార్చిలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కేటాయింపు కోసం వివిధ శాఖలు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు గడ్డెన్నవాగు కెనాల్, భైంసా మండలంలోని గుండెగావ్ పునరావాస ఎంపిక, 27, 28 ప్యాకేజీ పనులు, సదర్మాట్తోపాటు వివిధశాఖల ముఖ్యమైన అభివృద్ధి పనులు, వాటికి అవసరమైన నిధులకు ప్రతిపాదనలు తయారుచేయాలని సూచించారు.
అర్హులందరికీ రైతుబంధు అందేలా చూడాలి..
జిల్లాలో 27 ప్యాకేజీ పనులతో పాటు ఆయా సాగునీటి ప్రా జెక్టుల్లో ముంపునకు గురైన భూములను ప్రభుత్వం రెవెన్యూ ఖాతాల్లో ఆన్లైన్ బ్లాక్ చేయడం వల్ల రైతుబంధు అందకుండా పోతున్నదని పలువురు రైతులు మంత్రి, కలెక్టర్‌ను కలిసి విన్నవించారు. మూడేండ్ల నుంచి రైతుబంధు రాక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి ఆర్థికసాయం అందేలా చూడాలని సూచించారు. విద్యాశాఖలో బదిలీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించిన డీఈవో రవీందర్‌రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా హోమోదయ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్, డైరీని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పథకాలపై మంత్రి, ఎమ్మెల్యే ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి, అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, డీఎఫ్‌వో వికాస్‌మీనా, మున్సిపల్ చైర్మన్లు గండ్రత్ ఈశ్వర్, జాబీర్ అహ్మద్, అంకం రాజేందర్, రైతుబంధు సమి తి జిల్లా కన్వీనర్ వెంకట్రామ్రెడ్డి, ఎంపీపీలు కొరిపెల్లి రామేశ్వర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, టీఎన్జీవో అధ్యక్షుడు ప్రభాకర్, జడ్పీటీసీ జీవన్‌రెడ్డి, జిల్లా అధికారులు శంకరయ్య, అశోక్, సుధారాణి, ఉమారాణి, మల్లికార్జున్, ధన్‌రాజ్, అంజిప్రసాద్, శ్రీనివాస్‌రెడ్డి, దేవేందర్, రవీందర్‌రెడ్డి, క్రాంతికిరణ్, హన్మండ్లు, రాజలింగం, రామారావు, నర్సింహారెడ్డి, స్రవంతి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కొవిడ్ నిబంధనలపై అవగాహన కల్పించాలి
ఎదులాపురం, జనవరి 10 : కొవిడ్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని తన చాంబర్లో సోమవారం వివిధ శాఖల అధికారులతో కొవిడ్ వ్యాప్తి నివారణ చర్యలు, పల్స్ పోలియోపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో కొవిడ్ పాజిటివ్ కేసులు ప్రబలకుండా వైద్య, మున్సిపల్, పంచాయతీ రాజ్, పోలీస్ అధికారులు ముందస్తు కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. షాపింగ్ మాల్స్, రైతు బజార్, సినిమా థియేటర్లు, దుకాణాలు ,వీధి వ్యాపారుల కూడళ్లలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించేలా చూడాలన్నారు. మున్సిపల్, పంచాయతీ శాఖ అధికారులు వారి పరిధిలోని దుకాణాల్లో నో మాస్క్- నో ఎంట్రీ అనే విధంగా బోర్డులను ఏర్పాటు చేయించాలని ఆదేశించారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చే వారిని స్క్రీనింగ్ నిర్వహించాలని వైద్య అధికారులను ఆదేశించారు. డీఎంహెచ్‌వో రాథోడ్ నరేందర్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి డోసు 98 శాతం, రెండో డోసు 80 శాతం మందికి, 45 శాతం 15 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు టీకా వేశామని తెలిపారు. ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 సంవత్సరాలు పైబడిన వారు బూస్టర్ డోసు తీసుకోవాలన్నారు. తొమ్మిది నెలల ముందు రెండో డోసు వ్యాక్సిన్ వేసుకున్న వారు ఈ టీకా తీసుకోవచ్చని పేర్కొన్నారు.
23 నుంచి పల్స్ పోలియో
పల్స్ పోలియో ఈ నెల 23న బూత్ స్థాయిలో 24, 25 తేదీల్లో ఇంటింటికీ పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. జిల్లాలో 78,260 మంది పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయాలన్నారు. అందుకు జిల్లా వ్యాప్తంగా 710 బూత్‌లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 1.08లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయన్నారు. వివిధ శాఖల సమన్వయంతో వందశాతం పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పల్స్ పోలియోకు సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. సమవేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి, మెడికల్ ఆఫీసర్ అతుల్, జిల్లా అటవీ శాఖ అధికారి రాజేశ్వర్, అదనపు ఎస్పీలు శ్రీనివాస్‌రావు, వినోద్ కుమార్, ఆర్డీవో రాజేశ్వర్, అదనపు జిల్లా వైద్యాధికారి సాధన, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.