ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, మార్చి 29 : జిల్లా కేంద్రంలోని ప్రధాన మంత్రి కౌశల్ కేంద్రం (పీఎంకేకే) నిర్వాహకులు కాసుల కోసం అడ్డదారులు తొక్కుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పేరిట డిగ్రీ, ఇంటర్, పదో తరగతి విద్యార్థులను చేర్చుకొని, ఆపై వారికి ఎలాంటివీ నేర్పించడం లేదని తెలుస్తున్నది. సరైన సిబ్బంది లేకపోవడంతో కేవలం కంప్యూటర్ టైపింగ్ మాత్రమే నేర్పిస్తూ.. కాలం వెళ్లదీస్తున్నారని పలువురు విద్యార్థులు చెబుతున్నారు. అడ్మిషన్ తీసుకున్న ఒకో విద్యార్థికి ప్రభుత్వం వేలాది రూపాయలు చెల్లిస్తున్నది.
దీన్ని ఆసరాగా చేసుకొని నిర్వాహకులు జిల్లా వ్యాప్తంగా ఉన్న 15 మండలాల నుంచి 200 మందిని చేర్చుకున్నారు. అడ్మిషన్ అయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇస్తామని, ఉద్యోగావకాశాలు కల్పిస్తామంటూ అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. దీనిని నమ్మి చేరిన విద్యార్థులకు ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ తరగతులు నిర్వహించడం లేదు. క్లాస్‌ల ప్రారంభానికి ఇంకా సమయం ఉందని, అప్పటి వరకు టైపింగ్ నేర్చుకోవాలంటూ దాట వేస్తున్నారని, కేవలం ఎనిమిది కంప్యూటర్లే ఉన్నాయని పలువురు విద్యార్థులు తెలిపారు.
కౌశల్ కేంద్రంలో అడ్మిషన్ అయిన విద్యార్థులకు ైస్టెఫండ్ వస్తుంది. అలాగే నిర్వాహకులకు నిర్వహణ డబ్బులు రావాలంటే బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి. కనీసం 80 శాతం హాజరు ఉంటేనే డబ్బులు వస్తాయి. ప్రస్తుతం ఇక్కడ 200 మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకోగా, ఇందులో కేవలం 50 నుంచి 80 మంది విద్యార్థులు మాత్రమే వచ్చి వేలి ముద్రలు వేసి వెళ్తున్నారు. అయితే, 100 శాతం వస్తున్నట్లు నకిలీ వేలి ముద్రలతో బయోమెట్రిక్ హాజరు సృష్టిస్తున్నారు. ప్రతి రోజూ విద్యార్థులు రాగానే, వారి వేలి ముద్రలు తీసుకొని ఉదయం, సాయంత్రం హాజరు వేస్తుంటారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ‘నమస్తే తెలంగాణ’ కేంద్రానికి వెళ్లగా ఇద్దరు విద్యార్థులు నకిలీ వేలిముద్రలు వేస్తూ కనబడ్డారు.
పీఎంకేకేలో ప్రోగ్రామ్‌లను నేర్పించడానికి 13 నుంచి 15 మంది ఉపాధ్యాయులు అవసరముండగా, కేవలం ఒకరిద్దరితో వెళ్లదీస్తున్నా రు. పూర్తిస్థాయి సిబ్బంది ఉందని రికార్డులు సృష్టించి ప్రతి నెలా లక్షల్లో దండుకుంటున్నట్లు తెలుస్తున్నది. కేంద్రానికి సంబంధించి పూర్తి వివరాలివ్వాలని నిర్వాహకులను కోరగా, ప్రస్తుతం రిక్రూట్మెంట్ జరుగుతుందని, ఇప్పుడే వివరాలు ఇవ్వలేమని దాట వేశారు. పీఎంకేకేలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుండగా, సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తున్నది.