
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్
బోథ్, సెప్టెంబర్ 9: మండలంలోని నక్కలవాడ, ధన్నూర్ (బీ) వాగుల వద్ద వంతెనల నిర్మాణానికి రూ 6.70 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ తెలిపారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న నక్కలవాడ వంతెనను గురువారం ఆయన పరిశీలించారు. బోథ్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో వంతెన వద్ద నీటి ప్రవాహంతో లక్ష్మీపూర్, కొత్తపల్లె, రేండ్లపల్లె, నక్కలవాడ గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను త్వరలోనే దూరం చేస్తామని చెప్పారు. ఇక్కడ వంతెన నిర్మాణానికి రూ. 3.20 కోట్లతో ప్రతిపాదనలు పంపించామన్నారు. రేండ్లపల్లె రోడ్డు మరమ్మతుకు రూ 10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వంతెన మరమ్మతుకు మరో రూ. 2 లక్షలు వెంటనే విడుదల చేయిస్తామని చెప్పారు. అనంతరం ధన్నూర్ (బీ) వంతెనను పరిశీలించారు. గ్రామస్తులు తమ ఇబ్బందులను ఎమ్మెల్యేకు వివరించగా, ఇక్కడ వంతెనకు రూ 3.50 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. కుచ్లాపూర్ క్రాస్‌రోడ్డు నుంచి ఖండిపల్లె వరకు రోడ్లు నిర్మాణం కోసం ఇప్పటికే నిధులు మంజూరై టెండర్లు సైతం పూర్తయ్యాయని, పనులు మొదలయ్యేలా ఆర్అండ్బీ అధికారులను ఆదేశిస్తామన్నారు. కార్యక్రమాల్లో ఎంపీపీ తుల శ్రీనివాస్, పార్టీ కన్వీనర్ రుక్మాణ్‌సింగ్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు తాహెర్‌బిన్ సలాం, సర్పంచ్‌లు గంగాధర్, విజయ్, ఎంపీటీసీలు నారాయణరెడ్డి, జుగాదిరావు, ఏఎంసీ చైర్మన్ భోజన్న, నాయకులు, రోడ్లు భవనాల శాఖ ఈఈ నర్సయ్యవర్మ, డీఈఈ సునీల్, ఏఈ సునీల్, పీఆర్ డీఈఈ రాథోడ్ శైలేందర్, ఏఈఈ రాజేశ్వర్, జేఈఈ నర్సింగ్ ఉన్నారు.