
ఆదివాసులను మోసం చేసేందుకు కుట్ర
ఒకరు ఓటుకు నోటు, మరొకరు నకిలీ పాస్‌పోర్టు కేసుల్లో జైలుపాలు
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
ఎదులాపురం, ఆగస్టు 9 : ఓటుకు నోటు కేసులో టీపీపీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, నకిలీ పాస్‌పోర్టు కేసులో జైలుకు వెళ్లివచ్చిన ఆదిలాబాద్ ఎంపీ సొయం బాపురావ్ తోడు దొంగలేనని, ఆదివాసుల గురించి మాట్లాడే నైతిక హక్కు వారికి లేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జనార్దన్‌రెడ్డి గార్డెన్లో సోమవారం జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్, నేడు బీజేపీ ప్రభుత్వాలు ఆదివాసులను మోసం చేస్తూనే ఉన్నాయన్నారు. 1981లో గిరిజనులను పోలీసులతో చంపించిన సంస్కృతి కాంగ్రెస్వాళ్లదేనని చెప్పారు. ఇప్పుడు అదే ఇంద్రవెల్లి స్తూపం వద్ద దండోరా నిర్వహిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అండగా నిలవకుండా మానిన ఇంద్రవెల్లి నెత్తుటి గా యాలను గుర్తుచేసేలా దండోరా నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. 2014 కంటే ముందు ప్రభుత్వాలు ఇంద్రవెల్లి స్తూపం వద్ద అమరుల త్యాగాలను గుర్తు చేస్తూ గిరిజనులు నివాళులర్పించడానికి అడ్డుకున్న ప్రభుత్వం మీది కాదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక గిరిజనుల మనోభావాలకు పెద్దపీట వేస్తూ వారిని గౌరవిస్తున్నారని తెలిపారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరూ ఇంద్రవెల్లి స్తూపం వద్ద నివాళులర్పించడం కొనసాగుతున్నదని ఎమ్మెల్యే గుర్తు చేశారు. జాతీయ స్థాయిలో పేరున్న నాగోబా జాతరకు సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో రూ.5 కోట్ల నిధులు మంజూరు చేస్తే ఆలయ నిర్మాణా పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. జోడేఘాట్‌లో నివాళులర్పించేందుకు కనీసం రాకపోకల మార్గం కూడా ఉండేది కాదని, సీఎం కేసీఆర్ స్వయంగా పరిశీలించి భవిష్యత్ తరానికి గుర్తుండెలా అక్కడే మ్యూజియం ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. ఇంతటి ప్రతిభాశాలిని విమర్శించే హక్కు ఎవరికీ లేదన్నారు. గతంలో ఆదివాసుల ప్రాంతాల్లో మలేరియా, డెంగీ, రక్తహీనత ఇలా వివిధ వ్యాధులతో బాధపడుతూ చనిపోతుండేవారని గుర్తుచేశారు. ఆదిలాబాద్‌లో మాత్రం దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లు పగ్గాలు అప్పజెప్పారన్నారు. ఈ దొంగలు చీకటి ఒప్పందం కుదుర్చుకొని గిరిజనుల్లో ఐకమత్యం దెబ్బతినేలా చేస్తున్నారన్నారు. మతతత్వ పార్టీలుగా ఒకరు, గిరిజనుల ఐక్యత దెబ్బతీసే పనిలో ఇంకొకరు దొంగ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మొదట బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రాంతాల్లో కేసీఆర్ ఇస్తున్న సంక్షేమ పథకాలను అమలు చేయించాలని హితవు పలికారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.