
అధికారులు అందుబాటులో ఉండాలి
ఇంద్రవెల్లి మండల సర్వసభ్య సమావేశంలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్
ఇంద్రవెల్లి, జనవరి 10 : అధికారులు గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఏజెన్సీ ప్రాంతాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ పేర్కొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ శోభాబాయి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. పోలీస్ బందోబస్తు మధ్య సమావేశం నిర్వహించారు. అధికారులు చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలపై శాఖల వారీగా సభ్యులకు వివరించారు. మిషన్ భగీరథ పథకం గురించి అధికారులు వివరిస్తుండగా ఎంపీటీసీలు, సర్పంచ్‌లు గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజక వర్గంలోని పలు మండలాల్లో అధికారుల నిర్లక్ష్యంతోనే గ్రామాల ప్రజలకు సక్రమంగా మిషన్ భగీరథ నీరు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులైన వారిపై సీఎం కేసీఆర్‌తో పాటు సీఎంవో స్మితా సబర్వాల్‌కు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి అభివృద్ధి పనులు చేయాలన్నారు. ధరణితో పాటు రేషన్ కార్డుల ఆన్లైన్ విధానంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రేషన్ బియ్యం తీసుకోవడానికి దూరభారం ఉన్న గ్రామాలను గుర్తించి అక్కడ మినీ రేషన్ షాపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ జాదవ్ శ్రీరాంనాయక్, తహసీల్దార్ రాఘవేంద్రరావ్, ఎంపీడీవో పుష్పలత, ఎంపీటీసీలు జాదవ్ స్వర్ణలత, కుమ్ర జంగుబాయి, సులోచన, ఆశాబాయి, కోవ రాజేశ్వర్, సర్చంచ్‌లు గాంధారి, శారద, విజయ, సేవంతబాయి, కుసుమబాయి, పార్వతీబాయి, జుగాదిరావ్, కైలాస్, జాకేశ్వర్, లక్ష్మణ్, రాంచందర్, షేకు, నాగోరావ్, మోహన్రావ్, అధికారులు పాల్గొన్నారు.
పండుగలకు ప్రాధాన్యత
ఉట్నూర్, జనవరి 10 : రాష్ట్రంలోని అన్ని వర్గాల పండుగలను ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదని ఎమ్మెల్యే రేఖానాయక్ పేర్కొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో దండారీ ఉత్సవాల్లో భాగంగా ఆదివాసీ గూడేలకు రూ.10వేల చొప్పున మంజూరైన చెక్కులను పటేళ్లకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీరాం, వైస్ ఎంపీపీ బాలాజీ, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమేశ్, నాయకులు ప్రభాకర్, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.