
ఎదులాపురం, నవంబర్ 8 : న్యాయవ్యవస్థపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి వై.రేణుక పేర్కొన్నారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సోమవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్య కార్యదర్శి మాట్లాడుతూ.. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ లో భాగంగా న్యాయవ్యవస్థపై ప్రజలకు అవగాహన కల్పించడం, న్యాయసేవా అధికార సంస్థ ద్వారా పేదవర్గాల వారికి ఉచితంగా న్యాయసహాయం చేస్తామని పేర్కొన్నారు. వివిధ సందర్భాల్లో అభాగ్యులు, నిరుపేదలకు సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సామాజిక ధృక్పథం, పేదవర్గాల అభ్యున్నతికి న్యాయ సహాయం అందించేలా జిల్లాల్లో న్యాయ సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. వివిధ సందర్భాల్లో క్రిమినల్, సివిల్ కేసుల్లో పేదలకు సహాయం అందించేందుకు న్యాయ సేవా సంస్థ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఆర్థికంగా, సామాజికంగా ఉన్నవారికి న్యాయసేవలు దక్కుతున్నాయని, పేదవర్గాలకోసం ఉచిత సహకారం అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 43 రోజుల పాటు విస్తృత ప్రచార కార్యక్రమాలను నిర్వహించి న్యాయ సేవలపై గ్రామగ్రామాన తెలియపరుస్తున్నట్లు చెప్పారు. మాదకద్రవ్యాల వినియోగం, పేదరిక నిర్మూలన వంటి అంశాలపై వివరిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక స్థోమత లేని, న్యాయసహాయంపై అవగాహన లేని వారికి జిల్లా న్యాయ సేవా అథారిటీ ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని చెప్పారు. బాధితులకు జిల్లా యం త్రాంగం సహకారంతో పరిహారం అందించనున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని జిల్లా యంత్రాంగం న్యాయసేవా అథారిటీకి వారధులుగా పనిచేస్తున్నారన్నారు. ఈ ప్రచార కార్యక్రమాలు ఈ నెల 14వ తేదీతో ముగియనున్నాయని తెలిపారు. ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా జిల్లాలో ప్రభుత్వ శాఖలు, జిల్లా న్యాయ సేవా సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. రెవెన్యూ, పంచాయతీ, న్యాయ, వివిధ శాఖల ద్వారా కార్యక్రమాలను ఏర్పాటు చేసి సర్పంచ్లు, ఇతర ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. వీసీలో ఆదిలాబాద్ జిల్లా న్యాయసేవా అథారిటీ కార్యదర్శి క్షమాదేశ్ పాండే, అదనపు కలెక్టర్లు ఎన్.నటరాజ్, రిజ్వాన్ బాషా షేక్, డీఆర్డీవో కిషన్, డీడబ్ల్యూవో మిల్కా, మున్సిపల్ కమిషనర్ శైలజ, జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి సాధన, డీపీవో శ్రీనివాస్, సఖీ కేంద్రం నిర్వాహకులు యశోద, న్యాయ సేశా అథారిటీ కార్యాలయం పర్యవేక్షకురాలు శైలజ పాల్గొన్నారు.