
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
ఆదిలాబాద్ రూరల్, నవంబర్ 8: పేద కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లిల్లు చేయడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రారంభించారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని మహాలక్ష్మీవాడ, క్రాంతినగర్, భుక్తాపూర్ కాలనీల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి సోమవారం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో పేద కుటుంబాల్లో ఆడపిల్ల పుట్టిందంటే భారంగా భావించేవారని తెలిపారు. మరి కొందరు పెళ్లిల్లు చేయలేక తీవ్ర ఇబ్బందులు పడేవారన్నారు. ఇలాంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లోని పేదవారికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద రూ.1,00,116 అందిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో ఆడపిల్ల పెళ్లిల్లు ఘనంగా నిర్వహిస్తూ పేదవారు తమ కుటుంబాలకు ముఖ్యమంత్రిని పెద్ద కొడుకుగా భావిసున్నారని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్‌చైర్మన్ జహీర్ రంజానీ, కౌన్సిలర్లు పందిరి భూమన్న, బండారి దేవన్న పాల్గొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు
జైనథ్, నవంబర్ 8 : గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభు త్వం కృషి చేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మండలంలోని గిమ్మలో రూ.16లక్షలతో నిర్మించనున్న ఆరోగ్య ఉపకేంద్రానికి మండల నాయకులతో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఆరోగ్య ఉపకేంద్రంలో మెడికల్ ఆఫీసర్లను నియమించి వైద్య సేవలు అందిస్తామన్నారు. గిమ్మలో డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని వెల్లడించారు. ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, వైస్ ఎంపీపీ విజయ్‌కుమార్, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ తల్లెల చంద్రయ్య, మండల కన్వీనర్ ఎస్ లింగారెడ్డి, ఎంపీటీసీ భోజన్న, పరమేశ్వర్, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.