
ఆదిలాబాద్, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / నిర్మల్ టౌన్, జనవరి 8 :రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా సాగుతు న్నది. సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతాంగం సాగు సంబురం చేసుకుంటున్నది. కాగా, ఇతర రాష్ర్టాల నుంచి కూలీల రాక ఇటీవల పెద్ద ఎత్తున పెరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న వనరులు, వసతులు బాగున్నా యని, తమ వద్ద పట్టించుకున్నోళ్లే లేరని కూలీలు చెబుతున్నారు. అక్కడ పనుల్లేక ఇక్క డికి వచ్చామని, ఆరు నెలల పాటు గిట్టుబాటు కూలితో నాలుగు పైసలు సంపాదించుకొని తమ కుటుంబాలను పోషించుకుంటున్నామని స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ సర్కారుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇతర రాష్ర్టాల్లో పనుల్లేక.. పస్తులుండలేక ఎంతో మంది కూలీలు మన రాష్ర్టానికి వలస వస్తున్నారు. పిల్లాపాపలతో సహా వచ్చి ఇక్కడే దొరికిన పనులు చేసుకుంటున్నారు. అక్కడ చేసుకునేందుకు పనుల్లేక, కనీసం చేద్దామన్నా చూపేవారు లేక పొట్ట చేతబట్టుకొని ఇక్కడికి వస్తున్నారు.తెలంగాణ ప్రభుత్వం ఏడేళ్లుగా అమలు చేస్తున్న పథకాలు రైతులకు వరంగా మారాయి. రైతుబంధు, రైతుబీమా, ప్రాజెక్టులు, చెక్‌డ్యాంల నిర్మాణం, మిషన్ కాకతీయ, విత్తనాలు, ఎరువుల పంపిణీ, 24 గంటల ఉచిత విద్యుత్ వంటివి లాభాలబాట పట్టించాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను సర్కారు కొనుగోలు చేస్తున్నది. ఈ ఏడాది వానకాలంలో రైతులు 18 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఉన్నత చదువులు చదివి కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేసే వారు గ్రామాలకు తిరిగొచ్చి వ్యవసాయం చేసుకుంటూ బాగా సంపాదిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులు రెండు సీజన్లలో పత్తి, వరి, సోయాబీన్, కంది, శనగ, జొన్న, మక్క, పెసర, మినుము పంటలు పండిస్తారు.
ఆరు నెలల పాటు పనులు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో యూపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ర్టాలకు చెందిన కూలీలకు ఆరు నెలల పాటు ఉపాధి లభిస్తున్నది. ఏటా సెప్టెంబర్, అక్టోబర్ నెలలో వీరు తమ రాష్ర్టాల నుంచి కుటుంబ సభ్యులతో పాటు జిల్లాకు చేరుకుంటారు. వానకాలంలో సాగు చేసిన సోయాబీన్ పంట కోతలు ప్రారంభంకాగానే గ్రామాలకు చేరుకొని పనుల్లో నిమగ్నమవుతారు. తర్వాత మక్క, వరి కోతలకు సంబంధించిన పనులు చేస్తారు. పంట కోయడం, తూకం వేయడం, లారీల్లో లోడ్ చేయడం వంటివి చేస్తారు. రైతులు ఈ కూలీలు, వారి కుటుంబసభ్యులకు గ్రామాల్లో వసతి కల్పిస్తారు. 10 నుంచి 12 మంది కూలీలు బృందంగా గ్రామాల్లోనే పంట తీయడం పూర్తయ్యేవరకు ఉంటారు. రెండు సీజన్ల మధ్య పంట దిగుబడులకు సమయం ఉన్నప్పుడు రైస్ మిల్లుల్లో బస్తాలు మోయడం వంటి పనులు చేస్తారు. రైతులు పత్తిచెట్టు నుంచి దూది తీసినందుకు కిలోకు రూ. 8 నుంచి రూ.10 చొప్పున, వడ్ల సంచులను తూకం వేసి లారీలో లోడ్ చేసినందుకు క్వింటాకు రూ.35 చొ ప్పున, సోయా, మక్క పంటలకు క్వింటాకు రూ.30 చొప్పున రైతులు చెల్లిస్తారు. ఉదయం 7 గంటలకు పనులు ప్రారంభించి సాయంత్రం 6 గంటల వరకు చేస్తారు. ఒక్కొక్కరికీ రోజు కూలి రూ.500 నుంచి రూ.800 వరకు లభిస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో ఉపాధి లభించడంపై ఇతర రాష్ర్టాల కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జిన్నింగ్ మిల్లులో పనిచేయడానికి వస్తాం..
మా దగ్గర పనులు సరిగా దొరకవు. చిన్న, చితక పనులు చేసుకున్నా కూలి గిట్టుబాటు కాదు. దీంతో కుటుంబాలను పోషించడం కష్టంగా ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పంట బాగా పండుతది. కుటుంబాలతో కలిసి ప్రతి సంవత్సరం జిన్నింగ్ మిల్లుల్లో పని చేయడానికి ఇక్కడికి వస్తాం. తాత్కాలిక నివాసాల్లో ఉంటాం. ఒక్కొక్కరికి నెలకు రూ.10 వేల వరకు కూలి లభిస్తుంది. అందరం కలిసి సంతోషంగా పనులు చేసుకుంటాం.-వికాస్, కూలీ, చంద్రాపూర్, మహారాష్ట్ర
ఇక్కడే జీతం ఎక్కువ..
మాది మహారాష్ట్రలోని అద్గవ్ తాలుకా లోహతండా. నేను భార్యాపిల్లలతో కలిసి మూడేళ్ల క్రితం తెలంగాణకు వచ్చా. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో పాలేరుగా పని చేస్తున్నా. మా వద్ద భూములున్నప్పటికీ నీరు లేకపోవడంతో పంటలు తక్కువగా వేస్తాం. వర్షం కురిస్తే పంటలు పండుతాయి. నేను అక్కడ జీతం చేస్తే లక్ష వరకు వచ్చేది. ఇక్కడ జీతం కోసం రాగా యజమాని రూ.1.30 లక్షల వరకు జీతం ఇచ్చి, వంట సామగ్రి కూడా ఇస్తున్నారు. నా భార్య, ఇద్దరు పిల్లలతో ఇక్కడే ఉండి వ్యవసాయ పనులను చూసుకుంటున్నా.-రాథోడ్ ప్రకాశ్, పాలేరు, మహారాష్ట్ర
ఏటా వందలాది మంది వస్తారు..
మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు ఏటా మహారాష్ట్ర నుంచి వందలాది మంది కూలీలు పనులు చేయడానికి వస్తారు. సోయాబీన్, పత్తి, వరి, కంది పంటలను తీయడం, నింపడం, లారీల్లో లోడింగ్, అన్లోడింగ్ చేయడం లాంటి పనులు చేస్తారు. రైతులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు మమ్మల్ని బాగా చూసుకుంటారు. ఇక్కడ పంటలు బాగా పండుతుండడంతో అక్టోబర్ నెలలో వచ్చి మార్చి వరకు పనులు చేసుకుంటాం. నెలకు కనీసం రూ.10 వేల వరకు సంపాదిస్తాం. స్థానికుల సహకారం సైతం బాగా ఉంటుంది.-ప్రమోద్, కూలీ, మహారాష్ట్ర