
బోథ్, నవంబర్ 7: గిరిజన గూడేల్లో పది రోజుల పాటు నిర్వహించిన దండారీ ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. చివరి రోజు గూడేల్లో గుస్సాడీలు డప్పు చప్పుళ్ల నడుమ నృత్యాలు చేశారు. అనంతరం గ్రామ పటేళ్ల ఇళ్ల ముందర గుస్సాడీ వేషధారణ వస్తువులు ఉంచి కోలాబోడి పూజలు చేశారు. గ్రామ సమీపంలోని దేవతలకు మహిళలు గారెలు, నైవేద్యాలు సమర్పించారు. కోళ్లు, మేకలు బలి ఇచ్చారు. అనంతరం గుస్సాడీలకు స్నానం చేయించడంతో ఉత్సవాలు ముగిశాయి. బోథ్ మండలంలోని అందూర్, మందబొగుడ, నాగాపూర్, పార్డీ (బీ), నిగిని, కంటెగాం, జీడీపల్లె, పట్నాపూర్, బాబెర, రేండ్లపల్లె, లక్ష్మీపూర్, కొత్తపల్లె, నక్కలవాడ, వజ్జర్, టివిటి, పరుపులపల్లె, రాజన్నపల్లెలో ఉత్సవాలను ముగించారు.
భీంపూర్, నవంబర్7: దీపావళి నేపథ్యంలో గోండు, కొలాం ఆదివాసీలు నిర్వహిస్తున్న దండారీ ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. మండలంలోని కొజ్జన్గూడ, టేకిడిరాంపూర్, అందర్‌బంద్, బేల్సరి రాంపూర్ తదితర గోండు పల్లెల్లో, ఇందూర్‌పల్లి,మందపల్లి,జలకొరి తదితర కొలాం గిరిజన పల్లెల్లో కొలాబొడి పూజలు చేశారు. గుస్సాడి, దండారీల్లో వివిధ వేషధారణలు తీసివేసి, వాయిద్యాలకు పూజలు చేశారు. భీమన్న, పెర్సపేన్లకు పూజలు నిర్వహించారు. కోడల్పేన్ దేవర ఘనంగా నిర్వహించి అకాడ చేశారు. సామూహిక విందులో పాల్గొన్నారు. దీనితో దండారీ ఉత్సవాలు ముగిసినట్లు పటేల్, మహాజన్ ప్రకటించారు. సర్పంచ్‌లు టేకం దాదారావు,చిన్ను, మడావి లింబాజీ, దండారీల సభ్యులు పుర్క శ్రీకాంత్, మడావి జైవంత్‌రావు, ఉయికె పాండురంగ్, కొచ్చాడె వాసుదేవ్, మారుతి, సంజీవ్, జనార్దన్, హేమన్రావు పాల్గొన్నారు.
నార్నూర్,నవంబర్7: ఉమ్మడి మండలలోని ఎంపల్లి(జీ),లోకారి(కే)తో పాటు పలు ఆదివాసీ గూడేల్లో దండారీ ఉత్సవాలు ముగిశాయి. గ్రామపటేల్ ఇంటి ముందు ఏత్మాసూర్ పేన్, గుస్సాడీ సామగ్రికి పూజలు చేశారు. గుస్సాడీలను గ్రామ పొలిమే వరకు సాగపంపారు. పొలిమేరలోని ఇప్పపువ్వు చెట్టు వద్ద వంటలు చేశారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు ఉన్నారు.
నార్నూర్, నవంబర్ 7: మండలంలోని మాన్కాపూర్లో ఆదివారం దండారీ ఉత్సవాలు నిర్వహించారు. పూజలు నిర్వహించి మహిళలు, యువకులు నృత్యాలు చేశారు.
జైనథ్, నవంబర్ 7: రాష్ట్ర ప్రభుత్వం దండారీ ఉత్సవాలకు రూ.10వేలు ప్రోత్సాహం అందిస్తున్నదని ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్ అన్నారు. మండలంలోని బెల్లురిగూడలో ఆదివారం నిర్వహించిన దండారీ ఉత్సవాల్లో గుస్సాడీలతో కలిసి నృత్యం చేశారు. కులమతాలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ సంతోష్‌రెడ్డి, నాయకులు ఎల్టీ వెంకట్‌రెడ్డి, వెంకన్న పాల్గొన్నారు.