మంచిర్యాలటౌన్, ఆగస్టు 7: చేనేత కార్మికులను ఆదుకోవాలని ప్రభుత్వానికి పద్మశాలీ, కార్మిక సంఘాలన నాయకులు పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని శనివారం మంచిర్యాలలో శ్రీ భక్త మార్కండేయ పద్మశాలీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చేనేత రంగానికి విశేష కృషి చేసిన జంజిరాల నారాయణను ఈ సందర్భంగా సంస్థ సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో 45 లక్షలకు పైగా పద్మశాలీలు ఉన్నారని, వీరికి చట్ట సభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని, చేనేతను జౌళి శాఖనుంచి వేరు చేయాలని, చేనేత మంత్రిత్వ శాఖకు పద్మశాలీ కులస్తులనే నియమించాలని, చేనేతకు జీఎస్టిని రద్దు చేయాలని, ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాలకు రూ 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, దళితులకు దళిత బంధు మాదిరి చేనేత బంధు పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సభ్యులు దొడ్డి సుభాష్ చంద్రబోస్, జంజిరాల నారాయణ, బూర్ల జ్ఞాని, మాటేటి శ్రీనివాస్, అడిచెర్ల రాజేశం, జీ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
చేనేత వస్ర్తాలనే ధరించాలి
శ్రీరాంపూర్, ఆగస్టు 7: ప్రతి ఒక్కరూ చేనేత వస్ర్తాలు ధరించి నేతన్నలను ప్రోత్సహించాలని ఆర్కే 7గని మేనేజర్ సబ్బని లక్షణ్ పేర్కొన్నారు. కార్మికులకు చేనేత వస్ర్తాలపై అవగాహన కల్పించారు. సేఫ్టీ ఆఫీసర్ లింగమూర్తి, టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి మెండ వెంకటి, డిప్యూటీ మేనేజర్ రామ్మోహన్, రవిశంకర్, రవీందర్, సర్వే ఆఫీసర్ రామ్మూర్తి, ఈఈ ప్రవీణ్ పాల్గొన్నారు.
జైపూర్ ఎస్టీపీపీలో..
జైపూర్, ఆగస్టు 7 : మండల కేంద్రంలోగల సింగరేణి విద్యుత్ కేంద్రంలో చేనేత వస్త్ర దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం శాస్త్రి మాట్లాడుతూ చేనేత వస్ర్తాలను ధరించడంతో కార్మికులకు ఉపాధి దొరుకుంతుందని తెలిపారు. చీఫ్ ఆఫ్ ఓఅండ్ఎం జైన్సింగ్, ఏజీఎం మురళీధర్, పర్సనల్ మేనేజర్ కేస నారాయణ, పీఎం రామశాస్త్రి తదితరులున్నారు.