పల్లె ప్రగతి పనుల ప్రామాణికంగా గుర్తింపు
జిల్లాలో 18 పంచాయతీల ఎంపికకు కసరత్తు
జిల్లా స్థాయి ఉత్తమ జీపీకి రూ. లక్షతో పాటు గోల్డ్‌మెడల్
డివిజన్ స్థాయి ఉత్తమ జీపీలకు రూ. 75 వేలతో పాటు సిల్వర్ మెడల్స్
మండలస్థాయి జీపీలకు రూ. 50 వేలు, కాంస్య పతకాలు
అక్టోబర్ 2న ప్రదానం చేసేందుకు ఏర్పాట్లు
కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాల ద్వారా ఆదర్శంగా తీర్చిదిద్దిన గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం తగిన గుర్తింపునిస్తున్నది. ఈ మేరకు జిల్లా స్థాయిలో ఉత్తమ జీపీకి రూ. లక్ష నగదుతో పాటు స్వర్ణ పతకం, డివిజన్ స్థాయిలో రూ. 75 వేలతో పాటు వెండి పతకం, మండల స్థాయిలో రూ. 50 వేల నగదుతో పాటు కాంస్య పతకాన్ని ప్రదానం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 18 పంచాయతీలను ఎంపిక చేయనుండగా, అక్టోబర్ 2(గాంధీ జయంతి)న అవార్డులను అందించేందుకు కసరత్తు మొదలుపెట్టింది.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె ప్రగతి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న గ్రామాలకు తగిన గుర్తింపునిస్తున్నది. ఈ మేరకు అక్టోబర్ 2(గాంధీ జయంతి)న ఉత్తమ పంచాయతీలకు అవార్డులు ప్రదానం చేయనున్నది. ఇందుకోసం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 18 గ్రామ పంచాయతీలను ఎంపిక చేసేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన పంచాయతీకి రూ. లక్ష నగదుతో పాటు స్వర్ణ పతకం అందించనుండగా, డివిజన్ల స్థాయిలో ఉత్తమ పంచాయతీకి రూ. 75 వేలతో పాటు వెండి పతకాలు ఇవ్వనున్నది. ప్రతి మండలం నుంచి ఒక ఆదర్శ గ్రామ పంచాయతీని ఎంపిక చేసి రూ. 50 వేల నగదుతో పాటు కాంస్య పతకాన్ని ప్రదానం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. పల్లె ప్రగతి ద్వారా చేపట్టిన పనులను ప్రామాణికంగా తీసుకొని ఉత్తమ పంచాయతీలను ఎంపిక చేయనున్నది.
335 జీపీల్లో పల్లె ప్రగతి పనులు..
జిల్లాలోని 15 మండలాల్లోగల 335 గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వం ప్రత్యేకంగా పల్లె ప్రగతి పనులను చేపట్టింది. పల్లెలను అభివృద్ధి పథంలో నడిపించడంతో పాటు రోడ్లు, విద్యుత్ సమస్యలు పరిష్కరించడం, పారిశుధ్య పనులు చేపట్టడం వంటివి చేసింది. దీనికి తోడు శ్మశాన వాటికలు, డంప్‌యార్డులు ఏర్పాటు చేసింది. పల్లె ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. హరితహారంలో భాగంగా వాడ వాడలా, ఖాళీ ప్రదేశాల్లో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటించింది.
ఎంపిక ఇలా..
జిల్లా స్థాయిలో ఒక గ్రామ పంచాయతీ, డివిజన్ స్థాయి అవార్డుల కోసం ఆసిఫాబాద్ డివిజన్లో ఒకటి, కాగజ్‌నగర్ డివిజన్లో మరో గ్రామ పంచాయతీని ఎంపిక చేయనున్నారు. అదేవిధంగా మండల స్థాయి అవార్డుల కోసం మండలానికి ఒకటి చొప్పున 15 గ్రామ పంచాయతీలను ఎంపిక చేయనున్నారు.
ఉత్తమ సర్పంచులకు కలెక్టర్ సన్మానం
జిల్లాలోని 15 మండలాల్లో ఉత్తమ సేవలు అందించిన 26 మంది సర్పంచులను కలెక్టర్ రాహుల్‌రాజ్ ఈ నెల 4న సన్మానించారు. ఆసిఫాబాద్ మండలంలోని మోతుగూడ, రహపల్లి సర్పంచ్‌లు, బెజ్జూర్ మండలంలోని కుష్నపల్లి, పాపన్‌పేట్, చింతలమానేపల్లి మండలంలోని రవీంద్రనగర్, దహెగాం మండలంలోని బీబ్ర, జైనూర్ మండలంలోని మార్లవాయి, దుబ్బగూడ, కాగజ్‌నగర్ మండలంలోని ఈస్గాం, కోసిని, కెరమెరి మండలంలోని ఝరి, మోడీ, కౌటాల మండలంలోని కన్నెపల్లి, కౌటాల, లింగాపూర్ మండలంలోని పిక్లతాండ, చోర్పల్లి, పెంచికల్పేట్ మండలంలోని చేడ్వాయి, రెబ్బన మండలంలోని వంకులం, నంబాల, సిర్పూర్-టీ మండలంలోని హుడ్కిలి, సిర్పూర్-యు మండలంలోని పాముల వాడ, తిర్యాణి మండలంలోని గుడిపేట్, గడల్పల్లి, మండగూడ, వాంకిడి మండలంలోని సవాతి, దాబా గ్రామాల సర్పంచులు అందించిన ఉత్తమసేవలకు కలెక్టర్ వారిని సన్మానించారు.