
మంజూరు చేసిన రాష్ట్ర సర్కారు
అభివృద్ధి పనులు, పరికరాల కొనుగోలుకు వినియోగం
ఇక అందుబాటులోకి 250 పడకలు
త్వరలోనే టెండర్లు పిలుస్తాం: మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్ అర్బన్, నవంబర్ 3 : నిర్మల్ జిల్లా దవాఖానకు రాష్ట్ర సర్కారు రూ. 48. 83 కోట్లను బుధవారం మంజూరు చేసింది. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో భాగంగా దవాఖాన అభివృద్ధి పనులు, పరికరాల కొనుగోలు, సిబ్బంది పెంపునకు వీటిని వెచ్చించను న్నారు. దీంతో పాటు 250 పడకలను అందుబాటులోకి తేనున్నారు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు పూర్తి చేయిస్తామని మంత్రి ఐకేరెడ్డి స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి ఇస్తున్న ప్రాధాన్యంలో భాగంగా నిర్మల్ జిల్లా దవాఖానకు రూ.48.83 కోట్లు మంజూరు చేసిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా ఏర్పడిన తర్వాత ఏరియా దవాఖానను జిల్లా దవాఖానగా అప్గ్రేడ్ చేశామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా దవాఖాన అభివృద్ధి పనులకు, వైద్య పరికరాలకు నిధులు మంజూరు చేయడంతో నిర్మల్ జిల్లా ప్రజలకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందుతాయని పేర్కొన్నారు. నిధుల మంజూరుతో దవాఖానలో 250 పడకలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జిల్లా వైద్యశాల స్థాయికి సరపడా వైద్యులు, ఇతర సిబ్బంది సంఖ్య పెంచి అధునాతన వైద్య పరికరాలను సమకూర్చుతామని పేర్కొన్నారు.