
నియోజకవర్గాల్లో అందించిన జడ్పీ చైర్మన్లు కోవ లక్ష్మి, జనార్దన్ రాథోడ్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, దివాకర్‌రావు, కోనేరు కోనప్ప
తీరొక్క రంగులు, డిజైన్లు, అంచులు చూస్తూ మురిసిన మహిళలు
పుట్టింటి కానుక అందించారని సీఎం కేసీఆర్‌కు దీవెనలు
ఆదిలాబాద్, (నమస్తే తెలంగాణ ప్రతినిధి), అక్టోబర్ 2, నమస్తే తెలంగాణ;ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ చీరెల పంపిణీ శనివారం అట్టహాసంగా మొదలుకాగా, ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపించింది. ఆదిలాబాద్‌లో ఎమ్మెల్యే జోగు రామన్న, నార్నూర్‌లో జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, మంచిర్యాల, లక్షెట్టిపేటలో ఎమ్మెల్యే దివాకర్‌రావు, కలెక్టర్ భారతీహోళికేరి, రెబ్బెన, జైనూర్‌లో జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, కాగజ్‌నగర్‌లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పాల్గొని అందజేయగా, ఆడబిడ్డలు వాటిని చూసి మురిసిపోయారు. సర్కారు పంపిన రంగు రంగుల డిజైన్లు, జరీ అంచులను చూస్తూ సంబురపడ్డారు. తనతో వచ్చిన అక్కా చెల్లెళ్లకు వాటిని చూపుతూ ఆనంద పడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ సల్లంగా ఉండాలంటూ దీవెనలు అందించారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ చీరెల పంపిణీ శనివారం అట్టహాసంగా పండుగ వాతావరణంలో ప్రారంభించారు. పట్టణాల్లో మెప్మా, గ్రామాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో 18ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ అందిస్తున్నారు. ఆదిలాబాద్‌లో ఎమ్మెల్యే జోగు రామన్న, నార్నూర్‌లో జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. ఎమ్మె ల్యే జోగు రామన్న మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాలు తెలంగాణ పండుగలను పట్టించుకోలేదన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించిందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు తమ పండుగలను సంతోషంగా జరుపుకోవడానికి ప్రభు త్వం సాయం అందిస్తున్నదని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,56,742 మంది మహిళలకు అందించనున్నారు.
మంచిర్యాలలో..
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీసీ ప్రాంతంలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, కలెక్టర్ భారతీ హోళికేరి, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్యతో కలిసి చీరలను పంపిణీ చేశారు. లక్షెట్టిపేట, సీసీసీ, న స్పూర్లో నిర్వహించిన కార్యక్రమాల్లోనూ ఎమ్మెల్యే పాల్గొన్నారు. చెన్నూర్ నియోజకవర్గకేంద్రంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ అర్చన గిల్డా అందజేశారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో చీరలను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదివారం అందజేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 2,80,603 మందికి పంపిణీ చేయాల్సి ఉంది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
రెబ్బెన, జైనూర్‌లో జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, కాగజ్‌నగర్‌లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బతుకమ్మ చీరలను మహిళలకు అందించారు. ఆదివారం నుంచి ఊరూరా అధికారులు, ప్రజా ప్రతినిధులు మహిళలకు చీరలు పంపిణీ చేయనున్నారు. కాగా, ఈ నెల 5వ తేదీలోగా జిల్లాలో లక్షా 88 వేల మందికి చీరలు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఆడబిడ్డల సంబురం..
తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ పండుగకు సర్కారు అందజేసిన చీరలను చూసి మహిళలు మురిసిపోతున్నారు. ప్రత్యేక డిజైన్లతో, ఆకర్షణీయమైన రంగులతో అందించిన సారె బాగుందని సంబురపడుతున్నారు. ఏటా పండుగకు ముందే సారెను అందజేయడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
డబ్బులు పోగేసుకునేటోళ్లం
మంచిర్యాలటౌన్, అక్టోబర్ 2 : ఏటా ప్రభుత్వం ఇస్తున్న బతుకమ్మ చీరను తీసుకుంటున్న. ఈసారి ఇంకా మంచి డిజైన్లలో చీరలు వచ్చాయి. గతంలో పండుగ వస్తుందంటే బట్టలు కొనడానికి డబ్బులు పోగేసుకునేవాళ్లం. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యామాని ఆ బాధ తప్పింది. మాలాంటి ఎందరో మహిళలు ఆనందంగా ఉంటున్నారు.
ఏ ప్రభుత్వమూఇయ్యలేదు..
కోటపల్లి, అక్టోబర్ 2 : తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరెలు ఇచ్చి మహిళలకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. గత ప్రభుత్వాలేవీ పండుగలకు మహిళలకు చీరెలు ఇచ్చిన దాఖలాలు లేవు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి బతుకమ్మ పండుగకు చీరెలు ఇస్తున్నది. ఇది గొప్ప నిర్ణయం. పండుగ పూట పేదలకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయి. మహిళలంతా సంతోష పడుతన్నారు.
కేసీఆర్ అన్న లెక్క..
నాకు 75 ఏండ్లు. ఆదిలాబాద్ పట్నం దస్నాపురంల ఉంట. బతుకమ్మ కోక ఇస్తుర్రంటే అచ్చిన. పింఛన్ ఇస్తున్న సీఎం కేసీఆర్ ఇపుడు గిట్ల కోకలు, చీరెలు గరీబు సరీబుకు ఇచ్చుకుంట తోడవుట్ట్టినోడివలె అయిండు.నాకు వైసు అయిందిగనీ.. లేకుంటే బొడ్డెమ్మల పండుగకు నా అన్నదమ్ముడు కేసీఆర్ సార్ పంపిన సారె కట్టుకొని ఆడుతుంటి. ఇప్పుడు ఆడకపోయినా తప్పక చీరె కట్టుకుంట.