
ఉమ్మడి జిల్లాలో పండుగ వాతావరణం
ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో 2805 మందికి ప్రయోజనం
సర్కారు నిర్ణయం భేష్ అంటూ ప్రశంసలు
ఆదిలాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రభుత్వం ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు కృషి చేస్తూనే, సిబ్బందికి అండగా నిలుస్తున్నది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 44 శాతం ఫిట్మెంట్ ఇవ్వడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించి.. రిటైర్మెంట్ వయసు సైతం పెంచింది. మరోవైపు ప్రతి నెలా ఫస్ట్కే జీతాలు అందించాలని నిర్ణయించి, సెప్టెంబర్ నెలకు సంబంధించిన వేతనాలను శుక్రవారం ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసింది. ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో 2805 మందికి ప్రయోజనం చేకూరగా, సర్వాత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
రాష్ట్ర ప్రగతి రథ చక్రం అని చెప్పుకునే ఆర్టీసీ సమైక్య పాలనలో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నది. రాష్ట్ర ఆవిర్భావ అనంతరం తెలంగాణ సర్కారు చేయూతనివ్వడంతో కష్టాల కడలి నుంచి గట్టెక్కింది. సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 44 శాతం ఫిట్మెంట్ ఇచ్చి కార్మికులకు అండగా నిలిచారు. అలాగే దారి తప్పిన ఆర్టీసీ బస్సును గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకున్నారు. యేటా బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించారు. కొత్త బస్సుల కొనుగోలు, డిపోలు, బస్టాండ్లలో మౌలిక సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టారు. అయితే కరోనా ప్రభావంతో ఆర్టీసీకి కష్టాలు మొదలయ్యాయి. వీటికి తోడు విపరీతంగా పెరిగిన డీజిల్, విడిభాగాల ధరలతో ఇక్కట్లు రెట్టింపయ్యాయి. కొవిడ్ కారణంగా నెలల తరబడి బస్సులు నిలిచిపోవడం, అడపాదడపా నడిచినా ప్రయాణికులు లేక సంస్థ కుదేలైంది. దాదాపు రెండేండ్లు ఇదే అనిశ్చితి కొనసాగింది. ఈ నేపథ్యంలో కార్మికులు, ఉద్యోగులకు వేతనాలు చెల్లించడమే గగనంగా మారిపోయింది.
ఫస్ట్ తేదీన వేతనాలిచ్చేందుకు కసరత్తు..
కరోనా, ఇతరత్రా కారణాలతో ఆర్టీసీ తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కార్మికులు, ఉద్యోగులకు మొదటి తేదీన వేతనాలు చెల్లించేందుకు ఇటీవలే బాధ్యతలు చేపట్టిన ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎం.డీ సజ్జనార్ ప్రయత్నాలు మొదలు బెట్టారు. ఆర్టీసీని గాడిలో పెట్టే విషయంలో కార్మికులు, ఉద్యోగులు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని భావించి మొదటి తేదీన వేతనాలు చెల్లించే విషయంపై కసరత్తు చేశారు. ప్రభుత్వ రంగ ఆధీనంలోని బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకొన్న ఆర్టీసీ సంస్థ ప్రతి నెలా ఒకటో తేదీన ఓవర్ డ్రాఫ్ట్ ద్వారనైనా, కార్మికులకు, ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకు సహకరించేలా ఏర్పాట్లు చేశారు.
ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో 2805 మంది..
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆదిలాబాద్ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని 2809 మంది సిబ్బందికి ప్రయోజనం చేకూరనున్నది. ఆదిలాబాద్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో ఆరు డిపోలు ఉన్నాయి. ఆదిలాబాద్ డిపో పరిధిలోని 556 మంది సిబ్బంది, నిర్మల్ డిపోలో 556 మంది సిబ్బంది, భైంసా డిపోలో 336 మంది, ఉట్నూర్ డిపోలో 152 మంది, మంచిర్యాల డిపోలో 503 మంది, ఆసిఫాబాద్ డిపోలో 352 మంది సిబ్బంది ఉన్నారు. వీరితో పాటు రీజియన్ కార్యాలయం, ఆరు డిపోల్లోని వివిధ విభాగాల్లో పనిచేసే సిబ్బంది 350 మంది వరకు ఉన్నారు. సర్కారు ఒకటో తారీఖునే వేతనాలు అందడంపై ఆర్టీసీ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి పదిహేను రోజుల ముందే దసరా పండుగొచ్చిందని వారంతా సంబురపడుతున్నారు.
సర్కారు నిర్ణయం బాగుంది
ఆసిఫాబాద్, అక్టోబర్ 1 : ఆర్టీసీలో పని చేస్తున్న కార్మికులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు ఇవ్వడం బాగుంది. సర్కారు నిర్ణయంతో ప్రతి కార్మికుడు మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు ఆసక్తి చూపుతాడు. తెలంగాణ సర్కారు ఆర్టీసీ సంస్థను లాభాల బాట పట్టించేందుకు కృషి చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ప్రజల్లోనూ సంస్థపైన నమ్మకం ఏర్పడుతుంది.
ఇక ఒకటో తారీఖున జీతం..
నిర్మల్ అర్బన్, అక్టోబర్ 1 : ఇప్పటి నుంచి ప్రతి నెలా ఒకటో తారీఖున జీతం ఇస్తరట. ఇందుకు చాలా సంతోషంగా ఉంది. పోయిన నెల వరకూ పదో తారీఖు దాటితే గానీ జీతం రాలే. ఫస్ట్ రాగానే జీతం ఎప్పుడు పడుతుందా అని చూసేటోళ్లం. సర్కారు ఆర్టీసీ సిబ్బంది అన్ని విధాలా ఆదుకుంటున్నది.
స్వరాష్ట్రంలోనే ఉద్యోగులకు న్యాయం
నిర్మల్ అర్బన్, అక్టోబర్1 : తెలంగాణ రాష్ట్రంలోనే ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయం జరుగుతుంది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకునేందుకు నూతన సంస్కరణలు తీసుకువస్తున్నారు. సంస్థను ఆర్టీసీలో కొరియర్ పార్సిల్, డ్రైవింగ్ శిక్షణకు అందుబాటులోకి తీసుకువచ్చి నష్టాల్లో ఉన్న సంస్థను ముందుకు తీసుకెళ్లారు. ఇది గొప్ప విషయం