
ధర్మసాగర్ చెరువులోనే అక్రమ నిర్మాణాలు
చెరువుకు గండి కొట్టలేదు చెత్తను మాత్రమే తొలగించారు
నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రాము
నిర్మల్ అర్బన్, అక్టోబర్1 : రాజకీయ లబ్ధి కోసమే మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిపై బీజేపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. 30 ఏండ్లలో ఎన్నడూ లేని విధంగా నిర్మల్‌లో భారీ వర్షాలు కురవడంతో చెరువులు నిండి అలుగులు పారుతున్నాయన్నారు. పట్టణంలోని గొలుసుకట్టు చెరువులు నిండిపోవడంతో దిగువ ప్రాంతంలోని ఇబ్రహీం చెరువు పూర్తిగా నిండిందన్నారు. దీంతో 33/11 కేవీ సబ్ స్టేషన్‌లోని నీరు చేరడంతో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని చెప్పారు. దీంతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సబ్‌స్టేషన్‌ను, చెరువును పరిశీలించారని గుర్తు చేశారు. అలుగుకు అడ్డుగా ఉన్న చెత్తను మాత్రమే తొలగించారన్నారు. చెరువుకు మంత్రి దగ్గరుండి గండి కొట్టించారని బీజేపీ నాయకులు ఆరోపించడం సరికాదన్నారు. చెరువును ఆనుకొని ఉన్న అక్రమ వెంచర్లను వెంటనే తొలగించాలని కలెక్టర్‌కు మంత్రి సూచించారన్నారు. అక్రమ లే అవుట్లు ఎవరు చేశారో ప్రజలకు తెలుసన్నారు.
అసత్య ఆరోపణలు చేస్తూ గంగ పుత్రులకు అన్యాయం జరిగిందనడం సరికాదన్నారు. ధర్మసాగర్ చెరువులో మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేశ్ అక్రమ నిర్మాణాలు చేపట్టినప్పుడు గంగ పుత్రులు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. గంగపుత్రులకు మాయ మాటలు చెప్పి వారిని తప్పుదోవ పట్టించవద్దన్నారు. రెండేళ్ల నుంచి ఇబ్రహీం చెరువులో అధికారికంగా ఒక్క చేప పిల్లను వేయలేదని మత్స్య శాఖ అధికారులు స్పష్టం చేశారన్నారు. పేద, మధ్య తరగతి మత్స్యకారులకు రుణాలు, వాహనాలను అందించి వారి ఆర్థిక ఎదుగుదలకు కృషి చేస్తున్నదన్నారు. రాజకీయ ఎదుగుదలకు మంత్రిపై ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సమావేశంలో కౌన్సిలర్లు వేణు, సంపంగి రవి, సలీం, గండ్రత్ రమణ, నరేందర్, బిట్లింగ్ నవీన్, ఎస్పీ రాజు, ప్రతినిధి ముడుసు సత్యనారాయణ, నాయకులు అడ్ప పోశెట్టి, శ్రీనివాస్, పద్మాకర్, రాజు, ముషీర్, జాఫర్, జాకీర్ తదితరులున్నారు.