
మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్
ఆదిలాబాద్ రూరల్, అక్టోబర్ 1: ఆదిలాబాద్‌ను సుందరంగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్అన్నారు. పట్టణంలో కొనసాగుతన్న అభివృద్ధి పనులు, మావల వద్ద ప్రవేశ ద్వారం పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టణంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. ప్రధాన కూడళ్లన్నింటిని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. అలాగే పట్టణంలోకి వచ్చే మావల, చాంద వద్ద రూ.70 లక్షలతో రెండు స్వాగత కమాన్లను నిర్మిస్తున్నామని తెలిపారు. పనులు చివరి దశకు చేరుకున్నాయన్నారు. ఎమ్మెల్యే జోగు రామన్న సహాయంతో పట్టణంలో రోడ్ల వెడల్పు, డివైడర్ల ఏర్పాటు, సెంట్రల్ లైటింగ్ సిస్టం, రోడ్ల మధ్యలో అందమైన మొక్కల పెంపకం లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. అలాగే చౌక్‌లో వద్ద ఆహ్లాదం కోసం గార్డెన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మరో మూడు, నాలుగు నెలల్లో పనులన్ని పూర్తి చేసి జిల్లా కేంద్రం రూపురేఖలు మార్చుతామన్నారు. రిమ్స్‌లో రోగుల సహాయకుల కోసం రూ.60 లక్షలతో చేపట్టిన భవన నిర్మాణాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆయన వెంట ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకట శేషయ్య, ఇంజినీర్ తిరుపతి, రాజేశ్వర్, అరుణ్, నాయకులు సాయిని రవి, ఇబ్రహీం, సాయి పాల్గొన్నారు.