సీనియర్ నాయకుడు, మందమర్రి
పట్టణ అధ్యక్షుడు శంకర్ రాజీనామా
మంచిర్యాల, ఫిబ్రవరి 21, నమస్తే తెలంగాణ/ మందమర్రి : జిల్లాలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు మద్ది శంకర్‌తోపాటు మరో ఎనిమిది మంది నాయకులు రాజీనామా చేస్తున్నట్లు సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంపై ఆ పార్టీ చూపుతున్న వివక్షతో విగిసిపోయామని, కోయగూడెం, సత్తుపల్లి, శ్రావణ్ పల్లి, కేకే 6 గనులను సింగరేణికి అప్పగించకుండా వేలం వేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ఆ పార్టీలో మనసు చంపుకొని ఉండలేక పోతున్నామంటూ స్పష్టం చేశారు. కాగా, భారతీయ జనతా పార్టీ పతనం ప్రారంభమైందని, ఆ పార్టీ నిజ స్వరూపాన్ని తెలుసుకొని ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారని టీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, విప్ బాల్క సుమన్ తెలిపారు.
భారతీయ జనతాపార్టీ అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మందమర్రి టౌన్ అధ్యక్షుడు మద్ది శంకర్ స్పష్టం చేశారు. తెలంగాణ సమాజంపై బీజేపీ సర్కారు చిన్నచూపుతున్నదని, తెలంగాణ ఆత్మగౌరవానికి బీజేపీలో విలువలేదని తెలిసి పార్టీ వీడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. పార్లమెంట్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని గేలిచేస్తూ, తల్లిని చంపి బిడ్డను బతికించారని పేర్కొన్నారని, ఈ మాటలను బట్టి రాష్ట్ర ఏర్పాటుపై ఆయనకు సదభిప్రాయం లేదని అర్థమయ్యిందని పేర్కొన్నారు. గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక రాష్ర్టాల్లో ఆయా ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు బొగ్గు గనుల వేలం పాటలను ఉపసంహరించుకున్నారని, బొగ్గు గనుల వేలం పాటలు రద్దు చేసి సింగరేణికి అప్పగించాలని సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ కార్యనిర్వాహక రాష్ట్ర అధ్యక్షుడు, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు సింగరేణి కార్మికులు మూడు రోజులు సమ్మె చేసినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అహంకార ధోరణితో వ్యవహరించిందని మండిపడ్డారు. కోయగూడెం, సత్తుపల్లి, శ్రావణ్ పల్లి, కేకే 6 గనులను సింగరేణికి అప్పగించకుండా వేలం వేయడాన్ని జీర్ణించుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనతో పాటు బీజేపీ మందమర్రి పట్టణ ఉపాధ్యక్షులు అందుగుల లక్ష్మణ్, బియ్యాల సమ్మయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి సెపూరి లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి దోనుగు రమేశ్, పార్టీ పట్టణ కోశాధికారి మురళి, యువమోర్చా మందమర్రి పట్టణ అధ్యక్షుడు పూసాల ఓదెలు, బూత్ అధ్యక్షులు బండి రవి, కెల్లేటి తిరుపతి కూడా రాజీనామా చేస్తున్నట్లు మద్ది శంకర్ వివరించారు. ఇన్నాళ్లూ తనకు సహకరించిన బీజేపీలోని తన మిత్రులు, సహచరులు, అనుచరులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తు రాజకీయ కార్యాచరణలో కూడా అందరి సహకారం కావాలని కోరారు.
బీజేపీ పతనం ప్రారంభమైంది
తెలంగాణపై బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచీ వివక్ష చూపుతున్నది. తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నది. రాష్ట్ర ఏర్పాటును కించపరుస్తూ ఇటీవల ప్రధాని తన మనసులోని మాటను బహిర్గతం చేశారు. రాష్ర్టాభివృద్ధిని ఓర్వలేకనే అడుగడుగునా విషం కక్కుతున్నారు. విభజన చట్టంలోని హామీలను అటకెక్కించారు. తెలంగాణకు కొంగుబంగారమైన సింగరేణిని కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుటిల ప్రయత్నం చేస్తున్నది. విద్యుత్ సంస్కరణల పేరుతో నిర్వహణను తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నది. భారతీయ జనతా పార్టీ పతనం ప్రారంభమైంది. నిజ స్వరూపాన్ని తెలుసుకొని ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. ఇది శుభపరిణామం.
– బాల్క సుమన్, ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ ఎమ్మెల్యే
.
సత్వర న్యాయం కోసమే ప్రత్యేక కోర్టు
హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి సతీశ్ చంద్ర శర్మ
వర్చువల్ విధానం ద్వారా పోక్సో కోర్టు ప్రారంభం
ఎదులాపురం, ఫిబ్రవరి 21 : పోక్సో కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందించేందుకే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి సతీష్ చంద్ర శర్మ పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు కార్యాలయంలోని పైఅంతస్తులో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి సతీశ్ చంద్ర శర్మ, హైకోర్టు న్యాయ మూర్తి (ఆదిలాబాద్ జిల్లా పరిపాలన వ్యవహారాల ఇన్‌చార్జ్జి) కే లక్ష్మణ్ తో కలిసి వర్చువల్ విధానం ద్వారా కోర్టు శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హైకోర్టు ప్రధా న న్యాయ మూర్తి మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలా బాద్ చాలా రోజులుగా ఫొక్సో యాక్ట్ కేసులు 640లు పెండింగ్‌లో ఉండడంతో కోర్టును ప్రారం భించామని పేర్కొన్నారు. మారు మూల ప్రాంతాల నుంచి వచ్చే కక్షిదారులకు ఇబ్బంది కలుగకుండా త్వరలోనే ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలో ప్రత్యేక కోర్టు ప్రారంభిస్తామన్నారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి కే లక్ష్మణ్ మాట్లాడుతూ పోక్సో కేసులు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరి పై ఉందన్నారు. బాధితులను ఒక సారి కోర్టుకు పిలువాలని, కోర్టులో స్నేహాపూరిక వాతావరణం ఉండేలా చూడాలన్నారు. న్యాయవాదులకు చట్టంపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. పోక్సో చట్టంలో నిబంధనలపై పూర్తిగా పట్టు సాధించాల న్నారు. అనంతరం ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయ మూర్తి ఎంఆర్ సునీత మాట్లాడుతూ చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న కేసులు సత్వరంగా పరిష్కరమవుతాయని పేర్కొన్నారు. చిన్నారులపై లైంగిక దాడులు జరుగకుండా విద్యా ర్థి దశ నుంచే అవగాహన కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉందన్నారు. అనంతరం ప్రత్యేక కోర్టు భవన శిలాఫలకం వద్ద హిందూ, ముస్లిం, క్రైస్తవు ల మతగురువులతో పూజలు, ప్రార్థనలు చేశారు. అనంతరం కోర్టు శిలాఫలకాన్ని ప్రారంభించారు. న్యాయమూర్తులు టీ శ్రీనివాసరావు, మైత్రేయి, ఉదయ్ భాస్కర్ రావు, యశ్వంత్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం రమణా రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంతోష్, అదనపు పీపీలు సంజయ్ కుమార్ వైరాగరే, శ్రీకాంత్, మధుకర్, సీడబ్ల్యూసీ చైర్మన్ వెంకట స్వామి, సభ్యులు డేవిడ్, సమీర్ ఉల్లాఖాన్, డీసీపీవో రాజేంద్ర ప్రసాద్, డీఎస్పీ వెంకటేశ్వరరావు, న్యాయవాదు లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.