
ఎదులాపురం, నవంబర్ 9 : నేరాల కట్టడికి పోలీసు అధికారులకు అదనంగా కీలక బాధ్యతలు అప్పగించినట్లు ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ ఎం.రాజేశ్చంద్ర పేర్కొన్నారు. పోలీస్ క్యాంపు కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం పోలీస్ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రధానంగా మూడు అంశాల్లో కీలకమైన బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంజాయి సాగు, రవాణా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించడానికి ఏఆర్ డీఎస్పీ ఎం.విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐలు ఈ.సాయన్న, పి.దివ్యభారతి, రిజర్వు పోలీసులతో కలిసి జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి కేంద్రీకరించేలా బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. ముఖ్యంగా గంజాయి సాగు చేస్తున్న పంట పొలాలను గుర్తించడం, రవాణా వ్యవస్థపై దృష్టి సారించడానికి ఈ బృందం పనిచేస్తుందన్నారు. ఆర్థిక నేరాల కట్టడికి అదనంగా పెట్రోలింగ్, గస్తీ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి పర్యవేక్షణ అధికారులుగా ఎస్ఐలు సయ్యద్ ముజాహిద్, భరత్ సుమన్‌కు కీలకమైన బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు.
రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వీరు కీలకమైన విధులు నిర్వహిస్తున్న పోలీసులకు పర్యవేక్షణ అధికారులుగా వ్యవహరించనున్నారని తెలిపారు. రాత్రి సమయంలో అదనంగా పోలీసు అధికారుల నియామకంతో ప్రజల రక్షణ, భద్రత వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని చెప్పారు. ఇంటరాగేషన్ రిపోర్టు విధానంతో నిందితుల పూర్తి వివరాలు ఆన్లైన్లో నమోదై, దీర్ఘకాలికంగా వారిపై దృష్టి కేంద్రీకరించడానికి అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో నమోదైన ప్రతి కేసులో ఇంటరాగేషన్ రిపోర్టు అప్డేట్ చేయడానికి ఎస్ఐలు సాయిరెడ్డి వెంకన్న, డీ రమేశ్‌కు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. అన్ని పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేసే పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ ఎం విజయ్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ జే కృష్ణమూర్తి, సీఐలు పోతారం శ్రీనివాస్, ఎస్ రామకృష్ణ, సీసీఎస్ సీఐ ఈ చంద్రమౌళి, ఎస్ఐలు పాల్గొన్నారు.