మొత్తం 445 పోస్టులు భర్తీ
372 స్టాఫ్ అసిస్టెంట్, 73 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
ఈ నెల 19 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ
ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
కరీంనగర్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :వ్యాపార, వాణిజ్య, ఆర్థిక లావాదేవీలతోపాటు ఖాతాదారుల ఆదరణతో దూసుకెళ్తున్న తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకు (టెస్కాబ్) పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు తెరలేపింది. ఒకేసారి ఎనిమిది జిల్లాల్లో 445 పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అందులో 372 స్టాఫ్ అసిస్టెంట్, 73 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉండగా, శనివారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో నేటి నుంచే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ పోస్టులను పూర్తి పారదర్శకంగా భర్తీ చేసేందుకు బ్యాంకు యాజమాన్యం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది.
దేశంలోని ఇతర రాష్ర్టాలతో పోలిస్తే రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకు అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్నది. జాతీయ బ్యాంకులకు దీటుగా సేవలను అందించడమే కాదు, అనేక అవార్డులను సొంతం చేసుకొని అభివృద్ధి పథాన ముందుకెళ్తున్నది. ఈ బ్యాంకు సేవలను రోజురోజుకూ విస్తృతం చేస్తున్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అనేక చోట్ల కొత్త బ్రాంచీలను ప్రారంభిస్తున్నారు. మొబైల్ ఏటీఎంలను ఓపెన్ చేస్తున్నారు. వీటితోపాటు విభిన్న రకాల సేవలతో వినియోగదారుల వద్దకు వెళ్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న స్పందనను దృష్టిలో పెట్టుకొని.. మరింత చేరువయ్యేలా సేవలను విస్తరించే దిశగా ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే పెద్ద మొత్తంలో పోస్టులు భర్తీ చేసేందుకు సిద్ధమయ్యారు.
445 పోస్టులు భర్తీకి శ్రీకారం..
సేవలను విస్తృతం చేయాలని భావించిన బ్యాంకు యాజమాన్యం, అందుకు అనుగుణంగా స్టాఫ్‌ను రిక్రూట్ చేసుకునే ప్రక్రియను చేపట్టింది. అందులో భాగంగానే ఎనిమిది జిల్లాల్లో పెద్ద మొత్తంలో పోస్టులను భర్తీ చేసే ప్రక్రియ చేపట్టింది. 372 స్టాఫ్ అసిస్టెంట్, 73 అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం శనివారం అన్ని జిల్లాల్లోనూ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేస్తున్నది. సంబంధిత ఉద్యోగాలకు విద్యార్హతలు, పరీక్షా విధానం, దరఖాస్తు చేసుకునే పద్ధతి, ఎంపిక పక్రియ వంటి అంశాలు, ఇతర పూర్తి వివరాల కోసం TSCB వెబ్సైట్ htpps://tscab.org ని చూడవచ్చని అధికారులు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఒకటికి రెండు సార్లు నిబంధనలు, ఇతర అంశాలను పూర్తిగా చదువుకున్న తర్వాత దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాదు, పోస్టులను పూర్తి పారదర్శకంగా భర్తీ చేసేందుకు కావాల్సిన అన్ని చర్యలను యాజమాన్యం తీసుకుంటున్నది. కాగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 69 పోస్టులు ఉండగా, అందులో 58 స్టాఫ్ అసిస్టెంట్, 11 అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ పోస్టుల ఖాళీగా ఉన్నాయని అధికారులు తెలిపారు.