17న ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్డే
కేటీఆర్ పిలుపుతో వేడుకలకు సిద్ధమైన టీఆర్ఎస్ శ్రేణులు
నేటి నుంచి మూడు రోజులపాటు సేవా కార్యక్రమాలు
అన్నదానం, రక్తదానం, మొక్కలు నాటడానికి అంతా రెడీ
మంత్రి, విప్, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి
ఆదిలాబాద్, ఫిబ్రవరి 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : 60 ఏండ్ల తెలంగాణ కలను సాకారం చేసి, స్వరాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ దేశానికే ఆదర్శంగా నిలిపిన సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను అంబరాన్నంటేలా నిర్వహించేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమయ్యాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో రంగంలోకి దిగాయి. 17వ తేదీన పుట్టిన రోజు ఉండగా, నేటి నుంచి మూడు రోజులపాటు సేవా దృక్పథాన్ని చాటుకునేలా కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. ఇందుకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పార్టీ నాలుగు జిల్లాల అధ్యక్షులు, మంత్రి, విప్, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
15వ తేదీ మంగళవారం.. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో అన్నదాన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా దవాఖానలు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాల్లో పండ్లు, ఆహారం, దుస్తులు పంపిణీ చేయనున్నారు.
16వ తేదీ బుధవారం.. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నారు.
17వ తేదీ గురువారం.. సర్వమత ప్రార్థనలు,మొక్కలు నాటడం చేపట్టనున్నారు. వీటితోపాటు ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా సేవా కార్యక్రమాలు కొనసాగుతాయి.