
ఎదులాపురం,నవంబర్ 9: వయోజనులు ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకునే విధంగా జిల్లాలో విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం స్వీప్ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. 18 ఏళ్లు విద్యార్థుల పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసేలా ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు సహకరించాలని కోరారు. ఈ నెల 30తో నమోదు గడువు పూర్తి కానుందని చెప్పారు. సోషల్ మీడియా, రేడియో, దూరదర్శన్, లోకల్ కేబుల్,వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. 18 ఏళ్లు నిండిన వారి పేర్లను ఓటర్లుగా నమోదు చేయడం, జాబితాలో తప్పులు లేకుండా చూడడం, భవిష్యత్తు ఓటర్లకు అవగాహన కల్పించడం స్వీప్ కోర్ కమిటీ బాధ్యత అని నోడల్ అధికారి లక్ష్మణ్ తెలిపారు. తెలుగు,హిందీ, మరాఠి,గోండి,లంబాడా భాష ల్లో ఓటర్ నమోదుపై వాయిస్ మెస్సేజ్‌లు, లోకల్ కేబుల్ టీవీల్లో స్క్రోలింగ్, ప్రచారం చేపట్టాలని స్వీప్ కోర్ కమిటీ సభ్యులు, జిల్లా పౌర సంబంధాల అధికారి ఎన్. భీమ్ కుమార్ సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎస్ నటరాజ్, ఆర్డీవో రాజేశ్వర్, నెహ్రూ యువకేంద్రం కో ఆర్డినేటర్ సుశీల్ భడ్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియా, ఆల్ ఇండియా రేడియో ప్రతినిధి రామేశ్వర్, ఈఎండీ రవి, ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ సత్యనారాయణ పాల్గొన్నారు.