నిలువెత్తు బంగారంతో పూజలు
మొక్కులు తీర్చుకున్న ప్రజాప్రతినిధులు
ఆయా చోట్ల పోలీసుల భారీ బందోబస్తు
కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/మంచిర్యాల రూరల్పమంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో సారక్క-సమ్మక్క జాతర వైభవంగా సాగుతున్నది. తల్లులిద్దరూ గద్దెలపై కొలువుదీరడంతో భక్తజనం వెల్లువలా తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నది. శుక్రవారం ఉదయం నుంచి ఆయాచోట్ల బారులు తీరి వరాల తల్లులను దర్శించుకొని జేజేలు పలికారు. ఒడిబియ్యం, పసుపు, కుంకుమ, నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించి సల్లంగ సూడాలని వేడుకున్నారు. ఆసిఫాబాద్‌లో ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మంచిర్యాలలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు తన కుటుంబ సభ్యులతో కలిసి వన దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో సమ్మక్క-సారక్క జాతర వైభవంగా సాగుతున్నది. తల్లులిద్దరూ గద్దెలపై కొలువుదీరడంతో భక్తులు వెల్లువలా తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. శుక్రవారం ఉదయం తండోపతండాలుగా చేరుకున్న ప్రజలతో ఆయా ప్రాంతాలు కిక్కిరిశాయి. బారులు తీరి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఒడిబియ్యం, పసుపు, కుంకుమ, బంగారం (బెల్లం) సమర్పించి కుటుంబ సభ్యులందరూ బాగుండేలా చూడాలని వేడుకున్నారు. వరాల తల్లులకు జేజేలు పలికారు. కోళ్లు, మేకలను బలిచ్చి అక్కడే సహపంక్తి భోజనాలు చేశారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పవిత్ర గోదావరి నదీ తీరాన కొలువుదీరిన సమ్మక్క-సారలమ్మను ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు-రాజమణి దంపతులు, తనయుడు విజిత్‌రావు, కోడలు ఉదయశ్రీతో కలిసి బంగారంతో అమ్మవార్లకు మొక్కుకున్నారు. అనంతరం మంచిర్యాల జాయింట్ కలెక్టర్ మధుసూదన్ నాయక్, ఆర్డీవో వేణు, ఏసీపీ సాధన రష్మీ పెరుమాళ్, మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య దర్శించుకున్నారు.
లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాలలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, ఏసీపీ సాధన రష్మీ పెరుమాళ్‌తో కలిసి పూజలు చేశారు. ఏసీపీ సిబ్బందితో కలిసి సెల్ఫీలు దిగారు. సీసీసీ ముక్కిడి పోచమ్మ ఆలయం వద్ద సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మక్క జాతరలో శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ ఆశ-సురేశ్ దంపతులు పూజలు చేశారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఆర్కే-1ఏ గని సమీపంలో పాలవాగు ఒడ్డున, ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గంగాపూర్, నక్కలగూడ, తిర్యాణి, కాగజ్‌నగర్ మండలంలోని పెద్దవాగు, సిర్పూర్, కౌటాల, బెజ్జూర్, దహెగాంలలో నిర్వహించిన జాతరలకు భక్తులు పోటెత్తారు. ఆసిఫాబాద్‌లో వాగు వద్ద ఏర్పాటు చేసిన గద్దెల వద్ద ఎమ్మెల్యే ఆత్రం సక్కు ప్రత్యేక పూజలు చేశారు. జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి మేడారం వెళ్లి వన దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. ఆయా చోట్ల పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ద్వారా పోలీస్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.