ఆకలి కాగానే అమ్మని అడగడం మానేశాం. వంటింట్లో ఏమున్నాయో చూసే అలవాటు నుంచి దూరంగా వచ్చేశాం. సరాసరి ఫోన్ తీసి జొమాటో మెనూ అన్వేషిస్తున్నాం! అందుకేనేమో జొమాటో మరో కొత్త అప్డేట్తో ముందుకొచ్చింది. అదే ‘డిస్ట్రిక్ట్’ యాప్. ఈ యాప్ ద్వారా జొమాటో తన ‘గోయింగ్-అవుట్’ వ్యాపారాన్ని ప్రోత్సహించాలనుకుంటున్నది. ఇందులో సినిమా టికెట్ బుకింగ్, ఈవెంట్ బుకింగ్ ఇంకా.. రెస్టారెంట్లలో టేబుల్ బుకింగ్ లాంటి సౌకర్యాలు కల్పిస్తున్నది. ఇక్కడ యూజర్లు సినిమాలు, స్పోర్ట్స్, లైవ్ ఈవెంట్స్, షాపింగ్ లాంటి వాటి కోసం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అంటే, ఇప్పుడు మీకు ఒకే యాప్లో అన్ని సౌకర్యాలు లభిస్తాయన్నమాట. డిస్ట్రిక్ట్ యాప్ను ప్రారంభిస్తున్నట్లు గతంలోనే జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఈ యాప్ iOS వినియోగదారులకు అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా పరిచయం కానుంది. ఇది వినియోగదారులకు వేగంగా, సులభంగా సేవలను అందిస్తుంది. ఫుడ్ డెలివరీతో మొదలైన జొమాటో తన ప్రస్థానాన్ని ఇతర విభాగాల సేవలకూ విస్తరిస్తున్నది. ఇప్పటికే కిరాణా సరుకుల డెలివరీ ప్రారంభించి విపణిలో దూసుకుపోతున్నది.