‘మౌనం.. మంచి భాషణం’ అంటారు పెద్దలు. అతిగా మాట్లాడటమే అనేక అనర్థాలకు కారణమని చెబుతుంటారు. కాబట్టి, కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటమే చాలా గొప్ప మేలని అంటుంటారు. తాజాగా, మానసిక నిపుణులు కూడా అదే చెబుతున్నారు. కొన్ని కీలక సందర్భాల్లో మౌనంగా ఉండటం వల్ల.. నాడీవ్యవస్థ మరింత ఎక్కువగా ప్రభావితం అవుతుందని అంటున్నారు. మెదడులోని ‘హిప్పోకాంపస్’లో కొత్త కణాల అభివృద్ధిని ప్రోత్సహిస్తుందనీ పేర్కొంటున్నారు.
ఈ హిప్పోకాంపస్ కొత్త విషయాలను నేర్చుకోవడం, జ్ఞాపకశక్తిలో కీలకంగా వ్యవహరించే నిర్మాణం. స్వల్పకాలిక జ్ఞాపకాలను దీర్ఘకాలిక జ్ఞాపకాలుగా మారుస్తుంది. మౌనంగా ఉండటం వల్ల సరైన నిర్ణయాలు తీసుకోవడానికీ, భావోద్వేగాల్ని నియంత్రించడానికీ కావాల్సిన సమయం కూడా దక్కుతుంది. సోషల్ సైకాలజీలోనూ మౌనం ఓ శక్తిమంతమైన సందేశంగా పనిచేస్తుంది. తక్కువగా మాట్లాడే వాళ్లే ప్రతికూల పరిస్థితుల్ని ఎక్కువగా నియంత్రించుకుంటారని మానసిక నిపుణులు చెబుతున్నారు.
కౌన్సెలింగ్ సమయంలోనూ మౌనాన్ని ఓ టెక్నిక్‌గా వాడుతూ.. క్లయింట్‌ను మరింత లోతుగా అర్థం చేసుకుంటామని సైకాలజిస్టులు అంటున్నారు. ముఖ్యంగా, దంపతుల మధ్య వాగ్వాదాలు జరిగేటప్పుడు ఎవరో ఒకరు మౌనంగా ఉండటమే తెలివైన నిర్ణయం. దీనివల్ల పరిస్థితుల్ని మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడానికి, పరిష్కార మార్గాలను అన్వేషించడానికి అవకాశం దక్కుతుంది.
అలాకాకుండా.. ఇద్దరూ మాటకు మాట పెంచుకుంటూ పోతే.. పరిస్థితులు మరింత దిగజారతాయి. వృత్తిపరమైన సమావేశాల్లోనూ సందర్భం గురించి తెలియనప్పుడు మౌనంగా ఉండిపోవడమే మంచిది. ఇలాంటి సమయాల్లో వేరేవాళ్లు చెబుతున్నది వినడం, నేర్చుకోవడమే తెలివైన పని. చూశారా… ప్రతిసారీ మన భావాల్ని మాటల్లోనే వ్యక్తపరచాల్సిన అవసరంలేదు. కొన్నిసార్లు మౌనంగా ఉండటం కూడా మంచిదే!