ముళ్లపూడి మాటలు ముత్యాలు.. వాటిని వెండితెర వాకిలిపై వెదజల్లి బాపు గీసిన రంగవల్లి… ముత్యాలముగ్గు. అవతార లక్ష్యం పూర్తవడంతో వాల్మీకి రామాయణం సీతారాముల ఎడబాటుతో ముగిసింది. ఆ రాములోరికి నమ్మినబంటు అయిన బాపు గారికి ఇది నచ్చలేదేమో! ఉత్తర రామాయణాన్ని అపురూప సాంఘిక దృశ్యకావ్యంగా పునర్లిఖించారు. వైకుంఠం వాకిట సుఖాంతంతో ముత్యాలముగ్గును వేసి.. సీతమ్మకు కానుకగా చదివించారు. రమణ రాత కళాపోషణ.. బాపు తీత కళాపోషణ.. వెరసి ముత్యాలముగ్గు ఉత్తినే తిని తొంగునేవాడిలోనూ కళాతృష్ణను తట్టిలేపింది. ఈ చిత్రరాజం వచ్చి యాభై ఏండ్లు పూర్తయింది. ఆ ముత్యాలముగ్గులోకి దిగడానికి ఇంత కన్నా గొప్ప సందర్భం ఏముంటుంది?
బాపు, రమణ ‘అందాల రాముడు’తో అదరగొట్టారు. అక్కినేనితో దోస్తీ మరింత చిక్కపడింది. ఆపై ఎన్టీఆర్‌తో ‘శ్రీ రామాంజనేయ యుద్ధం’ తీశారు. ఫలితం పేలవంగా ఉన్నా.. పెద్దాయనకు వీళ్ల జోడీపై నమ్మకం సడలలేదు. అప్పటికే, ఎన్టీఆర్, ఏయన్నార్ కలిసి స్క్రీన్ పంచుకొని చాలా కాలమైంది. ఆ ఇద్దరినీ కలిపి తమదైన ముద్దర వేయాలని అనుకున్నారీ ఇద్దరు. త్యాగరాజుగా అక్కినేని, రామచంద్రమూర్తిగా ఎన్టీఆర్. థాట్ భలేగా వచ్చింది. కానీ, అక్కినేని గుండె ఆపరేషన్ కోసం అమెరికా వెళ్లిపోయాడు. ఆయన రావాలి, ఆరోగ్యం కుదుటపడాలి, డేట్స్ కుదరాలి, అప్పటికి ఎన్టీఆర్ ఫ్రీగా ఉండాలి.. ఇవన్నీ కుదరాలంటే కాలం కలిసి రావాలి. అప్పటి దాకా కాలక్షేపం ఎందుకు.. మరో సినిమా చేస్తే పోలా అనుకున్నారు వారిదైన శైలిలో! అలా దిగ్గజ నటులతో తీయాల్సిన అపురూప చిత్రం తెరమరుగైంది. ముత్యాలముగ్గు ముందుకొచ్చింది.
కథా వస్తువు ఉత్తర రామాయణం. దాన్ని సోషలైజ్ చేశారు రమణ. అంతా ఇంతా చేయలేదాయన. రాముడు, సీత, రావణుడు, మండోదరి, మారీచుడు ఇలా కావాలనుకున్న పాత్రలన్నిటినీ సోషలైజ్ చేశారు. బాపు మెచ్చుకునేంతగా ట్రీట్మెంట్ చేశారు. కథ కుదిరింది. తక్కువ బడ్జెట్లో తీసేయాలి. అందుకోసం కొత్త నటులను ఎంచుకోవాలి. తెలిసిన కథను తెలియని ముఖాలపై తేలిపోకుండా తీయాలి. హీరోగా అప్పటికి అప్‌కమింగ్ ఆర్టిస్ట్ శ్రీధర్ ఫిక్సయ్యాడు. హీరోయిన్గా కంప్లీట్‌గా కొత్త నటి సంగీతను తొలిపరిచయం చేయాలని డిసైడ్ అయ్యారు. వెరైటీ విలన్ కావాలి. కథలో ఆయన కీలకం. ముళ్లపూడి స్వేచ్ఛగా రాసిన మాటలను డిఫరెంట్ డిక్షన్లో పలకాలి. రావు గోపాలరావును అనుకున్నారు. బడ్జెట్ రూ.12 లక్షలు. అందులోనే సినిమా అయిపోవాలి. అయిపోగొట్టేశారు. 1975లో ‘ముత్యాలముగ్గు’ రిలీజైంది. మూడ్రోజులు నో టాక్. నాలుగో రోజు అందరూ ఆ ముగ్గులోకి దిగారు. సీతమ్మ కథట.. అని ఆడవాళ్లు. కొత్త విలన్ డైలాగులు ఓ రేంజ్లో చెప్పాడట అని పురుషులు. చిన్నపిల్లతో ఆంజనేయస్వామి మాట్లాడతాడట అని పిల్లలు.. ఆ పిల్లలను తీసుకెళ్లడానికి పెద్దలు.. ఇలా అందరూ చూడటం మొదలుపెట్టారు. యాభై రోజులు కూడా ఎక్స్పెక్ట్ చేయని సినిమా.. పాతిక వారాలు హౌస్‌ఫుల్ కలెక్షన్లతో ఆడేసింది. బాపు-రమణ ద్వయం పేరు ఇండస్ట్రీలో మరోసారి మార్మోగింది.
సంగీత పాత్ర సీతమ్మతల్లంత సహనం కలిగిన ఇల్లాలు! శ్రీధర్ రాముడంతటి గొప్ప మనసున్నవాడు. ఆయన తండ్రి (కాంతారావు) జమీందారు దశరథుడి వంటివాడు. శ్రీధర్ స్నేహితుడి చెల్లెలు సంగీత. కాంతారావు ఆర్థిక సాయంతో జరుగుతున్న సంగీత పెండ్లి మధ్యలోనే ఆగిపోతుంది. ఆ వరుడు (నూతన్ ప్రసాద్) నిత్య పెండ్లికొడుకనీ, ఇలా పెండ్లిళ్లు చేసుకొని కట్నంతో ఉడాయిస్తున్నాడనీ పోలీసులు వచ్చి అతణ్ని పట్టుకుపోతారు. ఆ పెండ్లికొచ్చిన వాళ్లు.. నిత్యపెండ్లి కొడుకును నిందించకుండా.. ఏ పాపిష్టి సొమ్ము ఇచ్చాడో, పిల్ల పెండ్లి ఆగిపోయింది అని శ్రీధర్ తండ్రిని ఆడిపోసుకుంటారు. ఆ మాటలు అతనికి నచ్చవు. సంగీత పెండ్లి కూతురు అని తెలియక ముందు తొలి చూపులోనే ఆమెను ఇష్టపడతాడు శ్రీధర్. ఆ ప్రేమను చాటుకోవడానికి, తండ్రి గొప్పవాడని చెప్పడానికి సంగీత మెడలో తాళి కడతాడు.
కొత్త దంపతులు కోటలోకి అడుగు పెడతారు. కాంతారావు తొలుత ఆక్షేపిస్తాడు. ఆయన బావమరిది ముక్కామల అగ్గిమీద గుగ్గిలం అయిపోతాడు. తన కూతురు ఉండాల్సిన చోట ఎవరో వచ్చారని కడుపుమంట అతనిది. ‘అమ్మాయి మహాలక్ష్మిలా ఉంది’ అంటుంది కాంతారావు అక్క. కోడలిని ఆదరించమని తమ్ముడికి చెబుతుంది. ఇద్దరూ దిష్టి తీయించుకొని గృహప్రవేశం చేస్తారు.
‘ముడుచుకునే కొలది మరీ మిడిసిపడే సింగారం’ అని అంతకుముందు పాడుకున్న పాటలోలాగా ముచ్చటగా ఉంటుంది సంగీత. తన భర్త గుండె గూటిలో ఒదిగిపోతుంది. కాపురం అంటే ఆకు, వక్కలా ఉండాలంటుందామె. ఒకసారి ఈ రెండూ కలిస్తే.. విడదీయడం బ్రహ్మతరం కాదని తన తల్లి చెప్పిందంటుంది. ఆ ఊహకు మురిసిపోతాడు శ్రీధర్. మన కాపురమూ అంతే అన్నట్టుగా ‘ముద్దు’గా బదులిస్తాడు. ఈ ఆలుమగల అనిర్వచనీయమైన అనురాగాన్ని ఓ మూడు నిమిషాల దృశ్యీకరణలో అద్భుతంగా ఆవిష్కరించారు బాపు. వారి మధ్య జరిగే సరదా సన్నివేశాలు, అలకలు, కులుకులు, చిరాకులు, పరాకులు గంపగుత్తగా షాట్స్‌గా తీసేసి.. కె.వి.మహదేవన్ స్వరపరచిన సితార్ వాద్యఘోష నేపథ్యంగా.. వాటిని కళాత్మకంగా చూపించారు దర్శకుడు.
కోటకు కొత్త కళ తెచ్చిన ఈ చిలకాగోరింకలను చూసి ముక్కామలకు కన్నుకుడుతుంది. అసలు ఈ కన్నుకుట్టాల్సిన వ్యక్తి రావి కొండలరావు. కాంతారావు బావమరిది పాత్రకు ముందుగా రావి కొండలరావునే అనుకున్నారట. ఆయన బాపు, రమణకు మంచి స్నేహితుడు కూడా! అయితే, అప్పటికే బతికి చెడ్డ ముక్కామల.. ఏదైనా పాత్ర ఇవ్వమని అడిగితే, ఆ పాత్ర ఆయనకిచ్చారట. కథలోకి వస్తే.. శ్రీధర్, సంగీతలను విడగొట్టాలి. అందుకు ఒక అదృశ్యహస్తం కావాలి. తన చేతికి మట్టి అంటకూడదు. గోతికాడ నక్కలాగా కోటలో ఉన్న జోగినాథం (అల్లు రామలింగయ్య) సాయం కోరుతాడు ముక్కామల. ఎప్పుడెప్పుడు ఈ ముసలాడిని బుట్టలో వేసుకుందామా అని చూస్తున్న అల్లు ఇక అల్లుకుపోతాడు. ముక్కామలను సరాసరి కాంట్రాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు.
ఈ గట్టి బేరం తగలకముందే కాంట్రాక్టర్ ఎంత గట్టిపిండమో తెలియజేసే సీన్ ఒకటి ఉంటుంది. మనసును ఆహ్లాదపరిచే సూర్యోదయాన్ని చూస్తుంటే.. అతగాడికి కలిగిన అనుభూతి అంతకుముందు ఏ సినిమాలో ఏ విలన్‌కూ కలగలేదు. ఆ తర్వాత కూడా ఎవరూ అంతలా అనుభూతి చెందలేదు. తొలి సంధ్య వేళలో విలన్ దగ్గరికి అతని సెగట్రీ వస్తాడు.
‘నారాయణ వచ్చాడండి’ అంటాడు. ‘వచ్చాడా? తీసుకొచ్చావా?’ ‘ఎస్ సార్ తీసుకొచ్చాను.. చూస్తారా?’ ‘అబ్బా సెగెట్రీ.. ఎప్పుడూ పనులు, బిజినెన్సేనా? పరగడుపునే కాసింత పచ్చిగాలి పీల్చి.. ఆ పెచ్చక్ష నారాయణుడి సేవ చేసుకోవద్దూ’ ‘ఎస్ సార్..’ ‘ఎస్సార్ కాదు.. కళ్లెట్టుకు చూడు. పైనేదో మర్డర్ జరిగినట్టు లేదూ.. ఆకాశంలో.. సూర్యుడు నెత్తురు గడ్డలా లేడూ..’ ‘అద్భుతం సార్’ ‘ఆఁ.. మడిసన్నాక కాసింత కలాపోసన ఉండాలయ్యా! ఉత్తినే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకీ తేడా ఏటుంటదీ’.. ఇదీ అతగాడి వాలకం. ఆ తర్వాతి సీన్లోనే మాడ, రావు గోపాలరావు సీను.. మరో అద్భుతం. ఈ సినిమాలో ఈ విలన్ డైలాగులు అప్పట్లో ఎల్పీ రికార్డుల్లా వచ్చి వేలం వెర్రిగా అమ్ముడుపోయాయట.
ఈ విలన్ పాలపడతాడు ముక్కామల. సెపరేషన్ కేస్ గురించి విడమరచి చెబుతాడు. బోల్డంత కర్సవుద్దంటాడు విలన్. అలాగే కానీ అంటాడు ముక్కామల. గతంలో సంగీతను పెండ్లాడజూసిన నూతన్‌ప్రసాద్‌కు ఈ సబ్‌కాంట్రాక్ట్ అప్పగిస్తాడు రావు గోపాలరావు. దొంగచాటుగా సంగీత, శ్రీధర్ పడకగదిలోకి చేరుతాడు నూతన్ ప్రసాద్. శ్రీధర్ చూస్తుండగా బయటికి పారిపోతాడు. పెండ్లి నిశ్చయమయ్యాక అన్నయ్యతోడు రాగా, నూతన్ ప్రసాద్‌తో సినిమాకు వెళ్లిన ముచ్చట గతంలోనే శ్రీధర్‌కు చెబుతుంది సంగీత.
ఆనాడు అతని మనసులో నాటుకున్న అనుమాన బీజం.. తాజా సన్నివేశంతో ఊడలమర్రై పాతుకుపోతుంది. ఏ రచ్చా చేయకుండా ఇంటి నుంచి వెళ్లిపోమ్మని చెబుతాడు శ్రీధర్. అప్పటికే ఆమె గర్భవతిగా ఉంటుంది. సంగీతకు పుట్టింటికి వెళ్లాలనిపించదు. చనిపోవాలనుకుంటుంది. దివాణంలో ఉన్న రామాలయం పూజారి సంగీతను ఆదరిస్తాడు. అలనాడు రాముడు అడవులకు పంపిన సీతమ్మను చేరదీసిన వాల్మీకి పాత్ర అన్నమాట ఇది. పూజారి కుటీరంలోనే కవల పిల్లలకు జన్మనిస్తుంది సంగీత. ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లాడు. ఏండ్లు గడిచిపోతాయి.
సంగీత వెళ్లిపోయిన ఆ రాజప్రాసాదం కళావిహీనంగా మారిపోతుంది. శ్రీధర్ నిరాశలో కూరుకుపోతాడు. కాంతారావు దిగాలుపడిపోతాడు. అనుకోకుండా అతను తన కోడల్ని కలుస్తాడు. కొడుకు, కోడలు మధ్య జరిగిన వివాదం గురించి తెలుసుకుంటాడు. తాను నచ్చజెబుతానంటాడు. వద్దంటుంది సంగీత. ఆయనే నిజం తెలుసుకొని తనను కలవాలంటుంది. ఈ చర్చంతా కవల పిల్లలు వింటారు. తల్లిదండ్రులను కలపడానికి పూనుకుంటారు. కవల పిల్లల్లో అమ్మాయికి ఆంజనేయస్వామి స్నేహితుడు. అబ్బాయికేమో ఓ కోతి మిత్రుడు. ఆంజనేయస్వామి ఆ అమ్మాయికి, సినిమా చూస్తున్న ప్రేక్షకులకు మాత్రమే కనిపిస్తాడు. ఆమెతో అన్నీ మాట్లాడుతుంటాడు. ఇద్దరు పిల్లలు కలిసి.. కాంట్రాక్టర్ చేసిన మోసాన్ని, ముక్కామల పన్నిన కుట్రను, అల్లు రామలింగయ్య బిగించిన ఉచ్చును ఛేదిస్తారు. శ్రీధర్ రియలైజ్ అవుతాడు. సంగీతను క్షమించమంటాడు. ఇద్దరూ కౌగిట్లో ఒదిగిపోతారు. అలా ఉత్తర రామాయణ సాంఘిక దృశ్యకావ్యం సుఖాంతం అవుతుంది.
ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా విడుదలైన ఈ సినిమా అఖండ విజయం సాధించింది. బాక్సాఫీస్ కలెక్షన్లు పిల్ల గోదావరిలా మొదలై.. రెండు వారాలు గడిచేసరికి అఖండ గోదావరిలా వెల్లువెత్తాయి. రమణ హ్యాపీ, బాపు ఇంకా హ్యాపీ! సినిమా చూసినవాళ్లు మరింత హ్యాపీ!! ముత్యాలముగ్గు జాతీయ అవార్డులు గెలుచుకుంది. ఇప్పటికీ.. టీవీలో వచ్చిన ప్రతిసారీ ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంటూనే ఉన్నది!!
ఈ సినిమాలో కాంట్రాక్టర్ రావణాసురుడి టైపు క్యారెక్టర్ అయితే, ఆయన ఇల్లాలు సూర్యకాంతం మండోదరి టైపన్నమాట. భర్త చేసే సెపరేషన్ కేసులు తెలియక ఆయన్నే ప్రత్యక్ష దైవంగా భావిస్తూ ఉంటుంది. వీరి కూతురిని నాటకీయంగా సంగీత అన్న పెండ్లి చేసుకుంటాడు. అనుమానం వచ్చిందంటూ వదిలేస్తాడు. ఇంత గొప్ప మనిషి కూతురుకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటూ కన్నీరుమున్నీరు అవుతుంది సూర్యకాంతం.
భర్తను అంత గుడ్డిగా నమ్మేస్తుందన్నమాట! శ్రీధర్-సంగీత పిల్లలతో కలిసి నాటకం రక్తి కట్టిస్తాడు కాంట్రాక్టర్ అల్లుడు (సంగీత అన్న). కూతురు కాపురం నిలబెట్టడం కోసం.. సంగీత విషయంలో తాను చేసిన మోసాన్ని కాంట్రాక్టర్ అందరి ముందూ ఒప్పేసుకుంటాడు. రామాయణంలో.. రాముడి బాణం దెబ్బకు నేలకొరిగిన రావణాసురుణ్ని ఎలాగైతే మండోదరి నిలదీస్తుందో.. అలాగే సూర్యకాంతం తన భర్తను కడిగిపారేస్తుంది. ఇక జోగినాథంగా అలరించిన అల్లు రామలింగయ్య నటన అద్భుతం. కోతి కరవడంతో ఆయన కోతిలా ప్రవర్తిస్తుంటాడు. ఆ సన్నివేశాల్లో ఆయన నటన అనన్య సామాన్యం అనిపిస్తుంది.
ముత్యాలముగ్గులో ప్రతీపాట సూపర్ హిట్టే! కె.వి.మహదేవన్ సంగీతం సమకూర్చిన ఈ గీతాలు ఇప్పటికీ మన మనసులు దోచేస్తూనే ఉన్నాయి.
1. శ్రీరామ జయరామ సీతారామ.. రాసింది ఆరుద్ర, పాడింది బాలమురళీ కృష్ణ. సినిమా టైటిల్ కార్డ్స్‌లో నేపథ్యంగా ఈ పాట
వినిపిస్తుంది.
2. ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు… రాసింది ఆరుద్ర, పాడింది రామకృష్ణ. గోదావరి కెరటాలపై, గూటి పడవలో సాగే ఈ పాట
ఎవర్గ్రీన్ హిట్ లిస్ట్‌లో చోటు దక్కించుకుంది.
3. ముత్యమంత పసుపు ముఖమెంతో ఛాయ..
ఇదీ ఆరుద్ర రాసిందే! సుశీల గానం చేశారు. తెలుగింటి ఆడపడుచు సౌభాగ్యాన్ని చక్కగా
వివరిస్తుందీ గీతం.
4. ఎంతటి రసికుడవో తెలిసెరా.. రాసింది సినారె, పాడింది సుశీల. సినిమాలో ముక్కామలను ముగ్గులోకి దించడానికి రాసిందీ గీతం.
5. గోగులు పూచె.. గోగులు పూచె.. రాసింది సినారె, పాడింది సుశీల, ఎస్పీబీ. కళాపిపాసులు మెచ్చిన పాట ఇది.6. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది.. రాసింది గుంటూరు శేషేంద్ర శర్మ, పాడింది సుశీల. శేషేంద్ర శర్మ రాసిన ఒకేఒక సినిమా పాట ఇది. తెలుగు సాహితీ రంగంలో మేరునగం అనిపించుకున్న ఆయన.. ఒకే ఒక్క సినిమా పాటతోనూ అంతే ఖ్యాతిని పొందారు. ‘ముత్యాలముగ్గు’ ఔట్‌డోర్ షూటింగ్ ఇందిరా ధనరాజ్ గారి ‘జ్ఞాన్‌బాగ్ ప్యాలెస్’లోనూ జరిగింది. ఆ నేపథ్యమే ఆయన ఈ పాట రాయడానికి దోహదం చేసి ఉండొచ్చు. శ్రద్ధగా వింటే సినిమా కథంతా ఈ ఒక్కపాటలో ప్రతిధ్వనిస్తుంది.