విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. ఆయన అవతారమైన కృష్ణమూర్తి అంతకు ఒకమెట్టు ఎక్కువే. ఆయన కిరీటంతో సరిపెట్టుకుంటే ఈయన దానిమీద నెమలి పింఛాన్నీ ధరిస్తాడు. ఆయన గోరింటాకుతో చేయి నింపుకొంటే, ఈయన దాన్ని వేణువుతో జోడించి వగలు పోతాడు. ఆయన తులసి మాలతో ఊరుకుంటే ఈయన వైజయంతిమాలనూ మెడలో వేసుకుంటాడు. ముస్తాబంటే అంత ముచ్చట కాబట్టే శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కన్నయ్యను ప్రతి ఇంటా చూడచక్కగా సింగారిస్తారు. ఆయన జన్మ తిథి రోజున కృష్ణమూర్తి విగ్రహాన్ని సర్వాలంకార భూషితంగా అలంకరిస్తారు. కొత్త బట్టలు కట్టి, రకరకాల దండలు వేసి చూడముచ్చటగా తీర్చిదిద్దుతారు. అయితే ఇలా ఇంటింటా జరిగే చిన్నికృష్ణుడి అలంకారం కోసం ఆకర్షణీయమైన దుస్తులూ, అందమైన నగలూ, ఆకట్టుకునే అలంకరణ సామగ్రి తయారు చేస్తున్నారు చెన్నైకి చెందిన డిజైనర్ కల్పనా సొంథాలియా. ‘అడోర్నింగ్ గాడ్’ పేరిట ఆమె స్థాపించిన ఈ సంస్థ దేవతా విగ్రహాలకు సంబంధించి విలాసవంతమైన యాక్సెసరీలు తయారుచేస్తుంది.
చందేరీ, పట్టులాంటి రకరకాల వస్ర్తాలతో విభిన్న రంగుల్లో కన్నయ్య కోసం దుస్తులు రూపొందిస్తారు కల్పన. సాదాసీదా మొదలు విభిన్న రకాల రాళ్లూ, ముత్యాలతో చేసే కిరీటాల్లాంటివీ తయారుచేస్తున్నారు. చేతికి తొడిగే కంకణాలు, పింఛాలు, ఆయనకు వేసే గొలుసులు.. అన్నీ సరికొత్తగా ఎంతో నాణ్యతతో సిద్ధం చేస్తున్నారు. నల్లనయ్యకు ఇష్టమైన వేణువును కూడా రకరకాల రాళ్లూ పూసలతో చూడగానే ముచ్చటగొలిపేలా ముస్తాబు చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లాంటి సామాజిక మాధ్యమాల్లో ఆ డిజైన్లకు ప్రచారం కల్పిస్తున్నారు. మన ఇంట్లో ఉండే కృష్ణుడి విగ్రహానికి ఇవి సరిపోవు అనుకున్నా, లేదా మనకు నచ్చినట్లుగా తయారు చేయించుకోవాలి అనుకున్నా కోరుకున్న రీతిలో కస్టమైజ్డ్ యాక్సెసరీలను తయారుచేసి ఇస్తారు. మొత్తానికి కృష్ణుడికీ ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్లు ఉన్నారన్నమాట!