మన దేశంలో రకరకాల నృత్య రీతులు ఉన్నాయి. అందులో కొన్నిటికి మంచి ప్రాచుర్యమే ఉంది. రాజపోషణ లభిస్తున్నది. మరికొన్ని మాత్రం క్రమంగా అంతరించిపోతున్నాయి. వాటిలో ఒడిస్సీ ఒకటి. కొన్ని దశాబ్దాలుగా జనం ఒడిస్సీని నేర్చుకోవడం మానేశారు. ఈ నాట్యానికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నది కొరియోగ్రాఫర్, డ్యాన్స్ టీచర్ మహికా సంపత్. రోజూ 45 నిమిషాల పాటు ఉచిత ఆన్లైన్ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నది మహిక. ఒడిస్సీ పుట్టుక, చరిత్ర, ప్రాధాన్యం గురించి విద్యార్థులకు తెలియజేస్తూ క్విజ్లు, మినీ డ్యాన్స్ షోలు జరుపుతున్నది. నాలుగేండ్ల వయసులోనే ఒడిస్సీ సాధన మొదలుపెట్టింది మహిక. గురుగ్రామ్ కేంద్రంగా తను ఒడిస్సీ నాట్య థెరపీ చేస్తూ.. ఎంతోమందికి మతిమరుపు, ఒత్తిడి మొదలైన మానసిక సమస్యల నుంచి విముక్తి కలిగిస్తున్నది. ‘డ్యాన్స్‌లోని టెక్నిక్స్‌తో రకరకాల సమస్యలను దూరం చేసుకోవచ్చు. డిప్రెషన్, ఈటింగ్ డిజార్డర్స్, డిమెన్షియా తదితర రుగ్మతలకు డ్యాన్స్ థెరపీ ఉపయోగకరంగా ఉంటుంది’ అని చెబుతున్నది మహిక.