గోరంత ఆత్మవిశ్వాసం.. కొండంత కష్టాన్ని చిన్నదిగా చేస్తుంది. బతుకు బాటలో ముందుకు కదిలేందుకు భరోసానిస్తుంది. అలాంటి ధైర్యానికి ప్రతిబింబంలా కనిపిస్తాడు నిర్మల్ జిల్లా కేంద్రంలో నివసించే తిరువెంగల నరేశ్. పదకొండేండ్ల క్రితం ఓ ప్రమాదంలో రెండు చేతులూ కోల్పోయిన అతను ఫ్లెక్సీ డిజైనర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అంతేకాదు, నలుగురిలో స్ఫూర్తి నింపాలనే లక్ష్యంతో యూట్యూబ్ చానల్ నడుపుతున్నాడు.
చిన్నచిన్న విషయాలకే బలవన్మరణాల దిశగా ఆలోచిస్తున్న వారెందరో! అలాంటి వారికి తన జీవితమే స్ఫూర్తి పాఠం కావాలంటాడు నిర్మల్ పట్టణంలోని బుధవార్‌పేట కాలనీకి చెందిన నరేశ్. తండ్రి చనిపోవడంతో కుటుంబ భారాన్ని తనే మోస్తున్నాడు. 2011లో.. ఫ్లెక్సీ కడుతూ విద్యుదాఘాతానికి గురయ్యాడు నరేశ్. ఈ సంఘటనలో తీవ్ర గాయాలపాలవ్వడమే కాకుండా, ఇన్ఫెక్షన్తో రెండు చేతులనూ కోల్పోయాడు. ఈ ప్రమాదం నరేశ్ జీవితాన్ని తలకిందులు చేసింది. మూడేండ్లపాటు మంచానికే పరిమితమయ్యాడు. వైద్యానికైన ఖర్చులతో అప్పులపాలయ్యాడు. ఈ వైకల్యంతో కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలంటూ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. మొదటి నుంచి ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న నరేశ్.. టీవీ చానళ్లు, సామాజిక మాధ్యమాలలో వచ్చే దివ్యాంగుల విజయగాథల ద్వారా స్ఫూర్తి పొందాడు. తనకు తెలిసిన డిజైనింగ్ కళకు మళ్లీ ఊపిరి పోయాలని నిర్ణయించుకున్నాడు. తన కంప్యూటర్‌పై సాధన మొదలు పెట్టాడు. మొండిచేతులతోనే మౌస్ కదిలిస్తూ గ్రాఫిక్ డిజైనింగ్ చేయడం అలవాటు చేసుకున్నాడు. పట్టుదలతో ఫ్లెక్సీ ప్రింటింగ్ నైపుణ్యాన్నీ పెంచుకున్నాడు. మూడేండ్ల్ల అప్రకటిత గృహ నిర్బంధం నుంచి బయటపడి మళ్లీ ఉపాధి వేట మొదలు పెట్టాడు. నరేశ్ నైపుణ్యం, ఆత్మవిశ్వాసం గుర్తించిన ఓ ఫ్లెక్సీ డిజైనింగ్ వ్యాపారి ఉపాధి కల్పించడానికి ముందుకొచ్చాడు. ప్రస్తుతం నరేశ్ నెలకు రూ.10 వేలకు పైగా సంపాదిస్తున్నాడు. అంతేకాదు తాను వైకల్యాన్ని, మానసిక కుంగుబాటును జయించిన తీరును నేటితరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ‘రాజు నరేశ్ నిర్మల్’ పేరుతో యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు. అందులో.. వైకల్యం ఉన్నప్పటికీ రోజువారీ పనులు ఎలా చేసుకోవచ్చో వివరిస్తూ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాడు. ఈ చానల్‌కు వేలమంది సబ్ స్ర్కైబర్లు ఉన్నారు. మిగిలినవారితో పోటీపడి క్రికెట్, బ్యాడ్మింటన్ ఆడుతూ ఎందరికో స్ఫూర్తి నింపుతున్నాడు ఈ యువకుడు. ‘సమస్యలకు, సవాళ్లకు భయపడకూడదు. ధైర్యంగా ఎదురునిలవాలి. పట్టుదలతో పోరాడాలి. ఎంత కష్టం వచ్చినా ఆత్మహత్య ఆలోచనలు వద్దు’ అని సలహా ఇస్తాడు నరేశ్. ననరేశ్.నతిరువెంగల నరేశ్.
-ఎం. మహేశ్‌కుమార్