ద పెరిఫెరల్ (వెబ్‌సిరీస్ సీజన్-1)
అమెజాన్ ప్రైమ్: అక్టోబర్ 20
దర్శకత్వం: స్కాట్స్మిత్
టైమ్‌ట్రావెల్ కథ ఇది. విలియమ్ గిబ్సన్ రాసిన నవల ఆధారంగా అదే పేరుతో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ఇంగ్లండులోని ఒక చిన్న పట్టణంలో నివసించే అన్నాచెల్లెళ్లు ప్రధాన పాత్రలుగా కథ నడుస్తుంది. వీరి తల్లి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. ఆమెకు వైద్యం చేయించడానికి వీడియోగేమ్స్ ద్వారా డబ్బులు సంపాదిస్తుంటారు ఈ అన్నాచెల్లెళ్లు. ఈ క్రమంలో ‘సిమ్యులేషన్స్’ అనే వర్చువల్ రియాలిటీ గేమ్ ఆడుతుండగా వారిద్దరూ అనూహ్యంగా భవిష్యత్తులోకి టైమ్ ట్రావెల్ చేస్తారు.
అక్కడ వారిని చంపేందుకు కొందరు పొంచి ఉంటారు. ఈ శత్రువుల నుంచి తప్పించుకునే క్రమంలో వారు చేసే సాహసాలు అద్భుతం అనిపిస్తాయి. కాలచక్రంలో ముందుకు, వెనక్కి చేసే ప్రయాణంలో వారికి ఎదురైన అనుభవాలు ఉత్కంఠను కలిగిస్తాయి. టైమ్ ట్రావెల్ కథలు హాలీవుడ్లో కొత్తేం కాకపోయినా, ‘ది పెరిఫెరల్’ అనూహ్యమైన మలుపులతో ఆకట్టుకుంటుంది.
భవిష్యత్తులోని రెండు కాల వ్యవధుల్లో కథను నడపటం ఇందులోని ప్రత్యేకత. యాక్షన్, డ్రామా అంశాలతో తీర్చిదిద్దిన తీరు కొత్త అనుభూతిని పంచుతుంది. కథానుగుణంగా 2099లో లండన్ నగరాన్ని ఓ ఎడారిగా, అరాచక శక్తులకు అడ్డాగా చూపించడం ఆలోచింపజేస్తుంది. ఎనిమిది ఎపిసోడ్స్‌లో దేనికదే ప్రత్యేకంగా అనిపిస్తుంది. గతంలో వచ్చిన టైమ్ ట్రావెల్ హాలీవుడ్ చిత్రాలు ‘ద మ్యాట్రిక్స్’, ‘స్ట్రేంజ్ వరల్డ్’ ఛాయలు కనిపించినా కథాపరంగా కొత్తగా అనిపిస్తుంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో ఉంది.