నాగస్వరానికి అనుగుణంగా మెరుపు వేగంతో శరీరాన్ని వంపులు తిప్పుతూ చేసే అద్భుతనృత్యం.. కాల్బేలియా. ఇది రాజస్థాన్‌లోని జిప్సీ తెగ సంప్రదాయ నృత్యం. మహిళలకే సొంతం. పురుషులు పక్కవాద్యాలకే పరిమితం. అంతరించిపోతున్న ఈ నృత్యాన్ని ప్రపంచానికి కొత్తగా పరిచయం చేస్తున్నది ఆశ సపేరా అనే కళాకారిణి. కాల్బేలియా, ఘూమర్ తదితర నృత్య రూపకాలు ఎడారి సమూహాల్లో ఎక్కువగా కనిపిస్తాయి.
ఈ ప్రజలు ఆహారం కోసం గాడిదలు, ఒంటెలపై ఆహార సామగ్రిని వేసుకుని.. రోజుల తరబడి అడవుల్లో తిరుగుతుంటారు. ఆ సమయంలో పాములతో సావాసం చేస్తారు. వాటిని ఆడించేందుకు నాగస్వరాన్ని పలికిస్తారు. జాతి సర్పాల్లా శరీరాన్ని మెలితిప్పుతూ ఆడతారు. ఏడుగురు పిల్లల్లో చిన్నదైన ఆశ ఐదేండ్ల వయసునుంచే కాల్బేలియా ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించింది. పద మూడేండ్లకే థాయ్‌లాండ్‌లో మొదటి అంతర్జాతీయ ప్రదర్శన ఇచ్చింది. ఇప్పటివరకూ 80 దేశాలకు కాల్బేలియాను పరిచయం చేసింది. ఆమె ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తుండటంతో విదేశాల్లో మరింత ఆదరణ పెరిగింది.‘తరతరాల వారసత్వ నృత్యాన్ని ప్రదర్శించడం నా అదృష్టం’ అంటారామె. తాజాగా జోధ్‌పూర్‌లో జరిగిన ‘రూట్స్ మ్యూజిక్ ఫెస్టివల్’లో తన కాల్బేలియా ప్రతిభతో వీక్షకులను ఆకట్టుకుంది ఆశ.