కొన్ని బంధాలు అత్యంత స్వచ్ఛమైనవీ, అమూల్యమైనవీ ఉంటాయి. అలాంటిదే తండ్రీ కూతుళ్ల బంధం కూడా. వాళ్లిద్దరి మధ్యా ఉండే ప్రేమానురాగాలను కొలిచే సాధనమంటూ ఉండదీ ప్రపంచంలో. అయితే చనిపోయిన తన తండ్రి మీద ఉన్న ప్రేమను ఓ అమ్మాయి వ్యక్తీకరించిన తీరు ప్రపంచం గుండెను తడిచేసింది. స్పెయిన్కు చెందిన వెరోనికా ఇటీవల తన డిగ్రీని పూర్తి చేసుకుంది.
పట్టా అందుకునేందుకు స్నాతకోత్సవానికి తనతో పాటు రావడానికి తండ్రి వెంటలేడు. ఆ విషయం ఆమెను నిలువనీయలేదు. నాన్న లేకపోతేనేం… నా తోడు నాన్న జ్ఞాపకాలు ఎప్పుడూ ఉంటాయి అనుకుంటూ తన తండ్రి ధరించిన టైలతో తన కోసం ఓ స్కర్టును కుట్టించుకుంది. ఆ స్కర్టునే ధరించి.. పట్టా అందుకోవడానికి వేదిక మీదకు వెళ్లింది.
ఈ విషయాలు చెబుతూ ఆమె పోస్ట్ చేసిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. ఆ స్కర్టు పోగుల్లో తన తండ్రి ప్రేమ దాగుందని, ఆయన స్పర్శ ఎప్పుడూ తనతోనే ఉండిపోతుందని ఆమె పంచుకున్న వీడియోకు కామెంట్లు పెడుతున్నారు వీక్షకులు. ఇదే తరహాలో కొలంబియా దేశంలోనూ మరో యువతి స్కర్టు కుట్టించుకుని తన తండ్రిమీద ప్రేమను చాటుకున్న చిత్రాలు కూడా ఎందరి హృదయాలనో హత్తుకుంటున్నాయి. గుప్పెడంత గుండెలో నాన్నంటే ఆకాశమంత ప్రేమ పెంచుకున్న ఈ అమ్మాయిల ఆలోచనకు ఎవరైనా హాట్సాఫ్ చెప్పాల్సిందే మరి!