గలగలా మాట్లాడేవారిని ‘వసపిట్ట’తో పోలుస్తాం. ‘వాగుడుకాయ’ అని ఆట పట్టిస్తుంటాం. ఇక.. ‘మగవాళ్ల కంటే మహిళలే ఎక్కువగా మాట్లాడుతారు’ అనే మాట కూడా అప్పుడప్పుడూ వింటూ ఉంటాం. ఈ మాటల్లో వాస్తవమెంతో తెలుసుకునేందుకు ‘యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా’ పరిశోధకులు ఓ అధ్యయనం నిర్వహించారు. ఆడవాళ్లు వసపిట్టలా ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారని తేల్చారు. అయితే, 25 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య వయసు స్త్రీలే.. ఇలా మాటల ఊటలను సృష్టిస్తారని వెల్లడించారు. మగవారి కంటే సగటున రోజుకు 3,000 ఎక్కువ పదాలు మాట్లాడతారని కనుగొన్నారు. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు.. ‘పర్సనాలిటీ అండ్ సోషల్ సైకాలజీ జర్నల్’లో ప్రచురితమయ్యాయి. నాలుగు దేశాల పరిధిలో 22 వేర్వేరు సర్వేలు నిర్వహించారు.
ఇందులో 10 నుంచి 94 సంవత్సరాల మధ్య ఉన్న 2,200 మంది పాల్గొన్నారు. వీరికి పోర్టబుల్ రికార్డింగ్ పరికరాలను అమర్చి.. వారు రోజులో సగటున ఎన్ని పదాలు మాట్లాడుతున్నారో తెలుసుకున్నారు. దాదాపు 6,30,000 రికార్డింగ్‌లను విశ్లేషించారు. ఈ సందర్భంగా పరిశోధకులు ఓ కొత్త విషయాన్ని కనుగొన్నారు. మాటల్లో లింగ భేదం.. కేవలం ఒక వయోవర్గంలో మాత్రమే కనిపించినట్టు చెప్పారు. 25 నుంచి 64 ఏళ్ల మధ్య వయసు మహిళలే ఎక్కువగా మాట్లాడుతున్నారని వెల్లడించారు. మహిళలు రోజుకు సగటున 21,845 పదాలు మాట్లాడగా, పురుషులు 18,570 మాట్లాడినట్టు చెప్పుకొచ్చారు. మహిళలు దాదాపు మూడువేల పదాలు ఎక్కువగా మాట్లాడుతున్నారని తేల్చారు. అయితే, 25 నుంచి 64 ఏళ్ల మహిళలపై పిల్లల పెంపకం ప్రభావం పడుతుందని, అది వారితో ఎక్కువగా మాట్లాడించేలా చేస్తుందని పరిశోధకులు అంటున్నారు.