మనిషికి అసలైన బలం.. ఆత్మవిశ్వాసమే! ఎంత ప్రతిభ ఉన్నా.. తనపై తనకు నమ్మకం లేకపోతే ఏమీ లేనట్లే! ఆత్మవిశ్వాసం.. మనిషిని నడిపించే దివ్యౌషధం కూడా! అయితే.. కొందరు మహిళా ఉద్యోగులు ఊరికే ఆత్మన్యూనతకు గురవుతున్నారట. ఆత్మవిశ్వాసాన్నీ కోల్పోతున్నారట. దీనికే ‘ఇంపోస్టర్ సిండ్రోమ్’ అనిపేరు. 1978లోనే ఈ పరిస్థితిని గుర్తించిన సైకాలజిస్టులు.. ఇదేం మానసిక రుగ్మత కాదనీ, మనుషుల్లో సహజంగానే ఉంటుందనీ తేల్చారు. నిన్న మొన్న ఉద్యోగంలో చేరిన జూనియర్లలో ఈ సమస్య ఎక్కువగా ఉంటే.. తమతమ వృత్తుల్లో తలపండిన వారూ ఇందుకు మినహాయింపేం కాదు! చాలామంది ఈ సమస్యతో సతమతం అవుతున్నారు. బయటపడే మార్గం కోసం అన్వేషిస్తున్నారు. ఇలాంటి ఆలోచనల నుంచి బయటపడేందుకు మానసిక నిపుణులు కొన్ని సలహాలు సూచనలు ఇస్తున్నారు.
మహిళల్లో ‘ఇంపోస్టర్ సిండ్రోమ్’ ఎక్కువగా ఉండటానికి కారణాలు అనేకం. చాలామందికి ఈ సమస్య ఇంట్లో నుంచే ప్రారంభం అవుతుంది. బాల్యంలోనే వారిపై వివక్ష మొదలవుతుంది. అబ్బాయిలను ఎక్కువగా గారాబం చేయడం.. వారు ఏం చేసినా తల్లిదండ్రులు సమర్థించడం మనం ఇప్పటికీ చూస్తుంటాం. అదే అమ్మాయిల విషయంలో కొంచెం కఠినంగా వ్యవహరించడం కూడా సర్వసాధారణం. దాంతో అమ్మాయిల్లో తెలియని ఆత్మన్యూనతా భావం పెరుగుతూ వస్తుంది. చదువు, ఉద్యోగాల్లోనూ కొనసాగుతుంది. పురుషాధిపత్యం, సాంకేతిక నైపుణ్యాల లోపం, మహిళలను తక్కువగా అంచనా వేయడం, ప్రోత్సహించేవారు లేకపోవడం లాంటివన్నీ అగ్నికి ఆజ్యం పోసేవే! ఇవన్నీ కలిసి చివరికి మహిళల్లో ‘ఇంపోస్టర్ సిండ్రోమ్’గా స్థిరపడతాయి. దాంతో ఈ భావన నుంచి బయటపడేందుకు అతిగా పనిచేస్తుంటారు. శక్తికి మించి ఎక్కువ కష్టపడుతుంటారు. అయితే, దీనివల్ల ఆరోగ్యం దెబ్బతినడం తప్ప.. కొత్తగా ఒరిగేదేం ఉండదు. పైగా.. డిప్రెషన్లోకి వెళ్లిపోయే ప్రమాదం కూడా ఉంటుందట.