భారతీయ కార్పొరేట్ కంపెనీల్లో మహిళా డైరెక్టర్ల ప్రాతినిధ్యం తగ్గుతున్నదట. నిఫ్టీలో లిస్ట్ అయిన టాప్-100 కంపెనీల్లోని ఐదు శాతం సంస్థల్లో ఇప్పటికీ మహిళా ఇండిపెండెంట్ డైరెక్టర్లు లేరట. కార్పొరేట్ గవర్నెన్స్ సర్వే సంస్థ.. ‘ఎక్సలెన్స్ ఎనేబ్లర్స్’ తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనం.. ఈ విషయాన్ని బయటపెట్టింది. గత మూడేళ్లుగా ఈ సంఖ్య క్రమక్రమంగా తగ్గుతున్నదనీ, అదే సమయంలో ఇండిపెండెంట్ డైరెక్టర్ల సంఖ్య పెరుగుతున్నదని వెల్లడించింది. ‘ఎక్సలెన్స్ ఎనేబ్లర్స్’ సర్వే ప్రకారం.. భారతీయ కార్పొరేట్ సంస్థల్లో మహిళా డైరెక్టర్ల సంఖ్య.. 2021లో 57 ఉండగా.. 2022లో 56కు, 2023లో 54కు, 2024లో 53కు పడిపోయింది.
అయితే, మొత్తం డైరెక్టర్ల శాతంలో మహిళా డైరెక్టర్ల సగటు మాత్రం అలాగే (20 శాతం) ఉంది. మహిళా స్వతంత్ర డైరెక్టర్లు మాత్రం.. 2021లో 101 మంది ఉండగా.. 2022లో 133, 2023లో 139, 2024లో 147కు పెరిగారు. కార్పొరేట్ కార్యాలయాల్లో సమర్థులైన మహిళలను గుర్తించడం, వారికి వృత్తిపరమైన పురోగతిని కల్పించినప్పుడే ఆయా సంస్థల బోర్డుల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుందని ఈ సర్వే చెబుతున్నది. అదే సమయంలో చైర్పర్సన్/ఎండీలుగా ఎదగడానికి, వివిధ బోర్డుల కమిటీలలో చేరి, వాటికి అధ్యక్షత వహించడంపైనా మహిళా ఉద్యోగులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నదని సూచిస్తున్నది.