మనదేశంలో శీతాకాలానికి వివాహాల సీజన్‌గా పేరున్నది. నవంబర్, డిసెంబర్లో దేశవ్యాప్తంగా 50 లక్షల వివాహాలు జరిగే అవకాశం ఉన్నది. దాంతో, హనీమూన్, వివాహానంతర ప్రయాణాలకు దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య పెరుగుతున్నది. ఈ క్రమంలో నూతన వధూవరులు తమ మొదటి విదేశీ పర్యటన కోసం యూరప్ దేశాలను ఎంచుకుంటున్నట్లు వీసా ప్రాసెసింగ్ ప్లాట్‌ఫామ్‘అట్లీస్’ వెల్లడించింది.
ఈ మేరకు నవంబర్ 2025 నుంచి ఫిబ్రవరి 2026 కోసం చేసిన దరఖాస్తులకు సంబంధించిన డేటాను నివేదించింది. దీని ప్రకారం.. ఈ సీజన్లో వీసా దరఖాస్తుదారులలో మిలీనియల్స్ 54 శాతం ఉన్నారని అట్లీస్ చెబుతున్నది. ఈ జనరేషన్ వారు ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు. భారీ ప్రయాణాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దాంతో, యూరప్ ట్రిప్స్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఖర్చులకు వెనకాడకుండా.. నచ్చిన ప్రదేశాలను చుట్టి వస్తున్నారు. మిలీనియల్ ప్రయాణికులలో సగం మంది స్కెంజెన్ దేశాలకు ప్రయాణం కడుతున్నారు. వారితోపాటు జెన్-జెడ్ కూడా ప్రయాణాల్లో తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటున్నారు.
ప్రస్తుత దరఖాస్తుదారులలో 25 శాతం మంది వాళ్లే ఉన్నారు. ఇక మొత్తం ప్రయాణికులలో మహిళల వాటా.. 34 శాతం ఉన్నది. నగరాల పరంగా చూసుకుంటే.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల నుంచి ఎక్కువమంది విదేశీ పర్యటనలకు ఆసక్తి చూపుతున్నారు. అదే సమయంలో లక్నో, లుథియానా, సూరత్ లాంటి టైర్-2 నగరవాసులు కూడా ఫారిన్ ట్రిప్ వేసేందుకు ముందుకొస్తున్నారు. ఇక హనీమూన్తోపాటు క్రిస్మస్ సీజన్‌ను ఆస్వాదించడానికీ పలువురు యూరప్ దేశాల్లో పర్యటిస్తున్నారు.