చలికాలం.. వాతావరణం విభిన్నంగా ఉంటుంది. ఉదయాన్నే కమ్ముకునే పొగమంచు.. మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అయితే.. ఆ ఆహ్లాదం వెనకే, అనారోగ్యమూ దాగి ఉంటుంది. చల్లని వాతావరణం.. శరీరానికి అనేక సమస్యలను తెచ్చి పెడుతుంది. అయితే, ఒక చిన్న చిట్కా ద్వారా.. ఇలాంటి ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే ‘వేడినీరు తాగడం’.. నిత్యకృత్యంగా చేసుకోవాలని సూచిస్తున్నారు.
శీతకాలంలో ఎదురయ్యే ప్రధాన సమస్యలు.. జలుబు, ముక్కుదిబ్బడ. ముఖ్యంగా, సైనసైటిస్ ఉన్నవారికి ఈ చల్లని వాతావరణం నరకమే!
ఉదయాన్నే ఒక గ్లాసు వెచ్చని నీరు తాగితే.. జలుబు, సైనస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. గొంతులో శ్లేష్మాన్ని కరిగించడంలో వేడినీరు సాయపడుతుంది. వేడినీటి నుంచి వచ్చే ఆవిరి.. సైనస్ వల్ల కలిగే ఒత్తిడిని తగ్గిస్తుంది.
చలి తీవ్రత పెరిగితే.. శరీరంలో రక్తనాళాలు కుంచించుకుపోతాయి. ఫలితంగా.. శరీర అవయవాలకు రక్త సరఫరా మందగిస్తుంది. అయితే.. వేడినీళ్లు అద్భుతమైన వాసోడైలేటర్గా పనిచేస్తాయి. ఇవి రక్తనాళాలను విస్తరింపజేసి.. రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. ఫలితంగా, గుండె ఆరోగ్యానికీ ప్రయోజనం చేకూరుతుంది. కండరాల నొప్పి నుంచీ ఉపశమనం కలుగుతుంది.
చలికాలంలో కొందరిలో ‘అచలాసియా కార్డియా’ సమస్య కనిపిస్తుంది. అన్నవాహిక కండరాలపై ప్రభావం చూపే ఈ సమస్య వల్ల ఆహారం తీసుకోవడం, నీళ్లు తాగడం కూడా కష్టమైపోతుంది. అయితే.. అన్నవాహిక కండరాలను సడలించడంలో వేడినీరు సాయపడుతుంది. తద్వారా అచలాసియా లక్షణాలు తగ్గి.. ఆహారం, నీళ్లు మింగడం సులభం అవుతుంది.
వేడినీటిని తాగడం.. జీర్ణవ్యవస్థకూ ప్రయోజనకరంగా ఉంటుంది. జీర్ణ అవయవాలకు రక్త ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది. వాటి పనితీరును మెరుగుపరుస్తుంది. వేడినీటిలో ఒక టీస్పూన్ నిమ్మరసం కలుపుకొని తాగితే.. ఆహారం త్వరగా విచ్ఛిన్నం అవుతుంది. శరీరం పోషకాలను మరింత సమర్థంగా గ్రహించేలా సాయపడుతుంది. మలబద్ధకం, కడుపుబ్బరం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.
వేడినీళ్లు.. పేగులను ఉత్తేజపరుస్తాయి. వాటి కదలికలను ప్రోత్సహిస్తాయి. ఆహారాన్ని సమర్థంగా విచ్ఛిన్నం చేస్తాయి. ఫలితంగా.. మలబద్ధకం దూరమవుతుంది.
చల్లని వాతావరణానికి ప్రతిస్పందనగా శరీరం వణుకుతుంది. అలాంటి సమయంలో వేడినీటిని తాగడం వల్ల.. శరీర అంతర్గత ఉష్ణోగ్రత పెరిగి.. వణుకు తగ్గుతుంది.
చలికాలంలో చెమట ఎక్కువగా పట్టదు. దీంతో శరీరంలోని వ్యర్థాలు లోపలే ఉండిపోతాయి. వేడినీరు తాగడం వల్ల.. శరీరంలో అంతర్గత ఉష్ణోగ్రత పెరిగి చెమట బాగా పడుతుంది. శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపించేస్తుంది. ఫలితంగా.. కాలేయం, మూత్రపిండాల పనితీరుకు భరోసా ఇస్తుంది.