కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా.. ఇప్పుడంతా ‘గీతూ’ జపమే చేస్తున్నది. ‘ఇలాంటి సినిమాను తెరకెక్కించిన ఆ మహిళా దర్శకురాలు ఎవరా?’ అని నెట్టింట సెర్చ్ మొదలైంది. ఇంతకూ విషయం ఏమిటంటే.. ‘కేజీఎఫ్’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకున్న కన్నడ స్టార్హీరో యశ్ తాజా చిత్రం.. ‘టాక్సిక్’. ఇటీవలే యశ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘టాక్సిక్’ గ్లింప్స్.. యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నది. విడుదలైన 24 గంటల్లోనే 35.9 మిలియన్ల వ్యూలను సాధించి.. అత్యధిక మంది వీక్షించిన భారతీయ సినిమా ‘గ్లింప్స్’గా నిలిచింది. అయితే.. హీరోతోపాటు నెటిజన్లను ఆకట్టుకున్న మరో అంశం.. ఈ చిత్ర దర్శకురాలు గీతూ మోహన్‌దాస్. ‘కేజీఎఫ్’లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత హీరో యశ్ ఒక మహిళా దర్శకురాలి సినిమాలో నటించడం.. ఈ సినిమా గ్లింప్స్‌తోనే అందరిలోనూ గూస్బంప్స్ తీసుకురావడంతో.. ఆమె ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు.
కేరళలోని కన్నూర్ గీతూ మోహన్‌దాస్ సొంతూరు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ ప్రయాణాన్ని ప్రారంభించిందామె. ఐదేళ్ల వయసులో.. తన నాలుగో చిత్రంలోనే మలయాళ స్టార్హీరో మోహన్‌లాల్‌తో స్క్రీన్‌ను పంచుకున్నది. ఈ చిత్రంలో ఆమె నటనకు.. ఉత్తమ బాలనటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం దక్కించుకున్నది. ఆ తర్వాత హీరోయిన్‌గానూ కొన్ని సినిమాలు చేసింది. ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డునూ అందుకున్నది. ఆ తర్వాత.. దర్శకురాలిగా మారి, మెగా ఫోన్ చేతపట్టింది.
గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం.. ‘కెల్కున్నుందో’. ఇదో షార్ట్‌ఫిల్మ్! అయినా.. లాంగ్ రన్లో ఎన్నో అవార్డులను అందుకున్నది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (రోటర్‌డామ్)లో ప్రదర్శితమైంది. ఉత్తమ షార్ట్ ఫిక్షన్‌గా మూడు అంతర్జాతీయ అవార్డులనూ గెలుచుకుంది. ఈ చిత్ర కథ.. 12వ తరగతి విద్యార్థుల కోసం కేరళ రాష్ట్ర సిలబస్‌లో చోటు సంపాదించుకున్నది. 2013లో ‘లయర్స్ డైస్’ చిత్రంతో దర్శకురాలిగా మరో మెట్టు ఎక్కింది. నవాజుద్దీన్ సిద్ధిఖీ, గీతాంజలి థాపా నటించిన ఈ సినిమా.. విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నది. రెండు జాతీయ చలనచిత్ర అవార్డులనూ అందుకున్నది. ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో.. 87వ ఆస్కార్ అవార్డులకు భారత్ నుంచి అధికారిక ప్రవేశం పొందింది. రెండో చిత్రం ‘మూథోన్’తో.. తన విజయ పరంపరను కొనసాగించింది గీతూ. ఈ సినిమా సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘గ్లోబల్ ఫిల్మ్ మేకర్ అవార్డు’ను తెచ్చిపెట్టింది. అలా.. అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న గీతూ మోహన్‌దాస్ నుంచి వస్తున్న మూడో చిత్రం.. టాక్సిక్. అందుకే, ‘టాక్సిక్’ చిత్రంపై భారత్‌లోనే కాకుండా, అంతర్జాతీయంగానూ భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఎన్ని అవార్డులు అందుకుంటుందో.. ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో తెలియాలంటే.. ఈ ఏడాది చివరివరకూ ఆగాల్సిందే!