కలి మాయో- కాల మహిమో.. లేత వయసులోనే తెల్లజుట్టు పలకరిస్తున్నది. ముప్పయ్ ఏండ్లు నిండకుండానే.. ముగ్గుబుట్ట నెత్తిమీదికి ఎక్కేస్తున్నది. ఆధునిక జీవనశైలి, పర్యావరణ కాలుష్యంతోపాటు ఆహారపు అలవాట్లు, జన్యుపరమైన సమస్యలు.. ఇందుకు కారణం! ఏదేమైనా.. వయసుతో సంబంధం లేకుండా జుట్టు రంగుమారడం యువత జీర్ణించుకోలేని విషయం!
దీర్ఘకాలికంగా ఒత్తిడికి లోనవడం వల్ల శరీరంలో మెలనిన్ ఉత్పత్తి తగ్గుతుంది. దానివల్ల జుట్టు రంగు మారుతుంది. నిద్ర సరిగా లేకపోయినా.. జుట్టు పెరుగుదలలో మార్పులు వస్తాయి. ధూమపానం చేసేవారిలో ఈ సమస్య మరీ ఎక్కువగా కనిపిస్తుంది. పొగాకులో ఉండే కొన్నిరకాల విషపదార్థాలు మెలనోసైట్లను దెబ్బతీస్తాయి. దాంతో జుట్టు మొదళ్లకు రక్త ప్రసరణ తగ్గిపోతుంది.
ఫలితంగా మెలనిన్ ఉత్పత్తి ఆగిపోయి.. జుట్టు తెల్లబడుతుంది. హార్మోన్ల అసమతుల్యతతోపాటు కొన్ని విటమిన్లు, మినరల్స్ లోపాలను కూడా తీసిపారేయలేం! శరీరంలో ఐరన్, రాగితోపాటు విటమిన్ బి12 లోపించడం వల్ల జుట్టు రంగు మారుతుందని కొన్ని పరీక్షల్లోనూ తేలింది. జుట్టు కుదుళ్లలోని డీఎన్ఏ సంశ్లేషణకు ఐరన్ ఎంతో అవసరం. ఇక మెలనిన్ ఉత్పత్తిలో రాగిది ప్రముఖ పాత్ర. విటమిన్ బి12 లోపిస్తే.. రక్తహీనతకు దారితీస్తుంది. మెలనిన్పై ప్రభావం చూపుతుంది.
థైరాయిడ్ సమస్యలు, హైపో థైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం వంటివి కూడా జుట్టు పెరుగుదలను నిలిపేస్తాయట. జుట్టు రంగు మారడానికి కారణమవుతాయట. అయితే.. ఈ సమస్యకు నివారణ ఒక్కటే సరైన మార్గమని సౌందర్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జుట్టు తెల్లబడక ముందే మేల్కోవాలని సూచిస్తున్నారు. అందుకోసం పోషకాహార లోపం లేకుండా.. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. ఎక్కువ ఒత్తిడికి గురికాకుండా చూసుకోవడం, ధూమపానం మానేయడం, కంటినిండా నిద్రపోవడం లాంటి సవ్యమైన జీవనశైలిని అలవర్చుకోవాలి.