బరువును కంట్రోల్లో ఉంచడంలో.. భోజనానిదే కీలకపాత్ర. అందుకే, బరువు తగ్గడానికి ఆహార నియమాలను ఆశ్రయిస్తారు. చాలామంది.. ‘భోజనం మానేయడమే సింపుల్ ట్రిక్’ అనుకుంటారు. రోజులో ఏదో ఒకపూట కడుపు కట్టేసుకుంటారు. అయినా, బరువు మాత్రం తగ్గరు. ఇందుకు గల కారణాలను నిపుణులు వివరిస్తున్నారు.
బరువు తగ్గాలని నిర్ణయించుకున్నప్పుడు చాలామంది చేసే పని.. భోజనం మానేయడం. అయితే.. ఇలా చేయడం చాలాపెద్ద తప్పు. భోజనం మానేయడం వల్ల బరువు తగ్గడం అటుంచి.. పలు సమస్యలబారిన పడతారు. ఆహారం తినకుండా ఉంటే.. శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజలవణాలు, ఇతర పోషకాలు అందకుండా పోతాయి. దాంతో బలహీనత, అలసట ఏర్పడతాయి. భోజనం మానేయడం వల్ల జీవక్రియ మందగిస్తుంది. ఎక్కువ రోజులు ఇలాగే ఉంటే.. జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. మలబద్ధకం, ఇతర జీర్ణ సమస్యలు ఎదురవుతాయి. పైగా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో ఏది మానేసినా.. మెటబాలిజం తగ్గిపోతుంది.
దాంతో.. బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకు బదులుగా.. పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని శరీరానికి అందించాలి. అప్పుడే బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందులోనూ భోజనం సమతూకంలో ఉండేలా చూసుకోవాలి. అంటే.. పళ్లెంలో ఫైబర్, కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్ అందించే పదార్థాలు ఉండాలి. అయితే, చాలామంది కార్బొహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకుంటారు. ఫైబర్, ప్రొటీన్లను వదిలేస్తారు. ఇలాంటప్పుడు తక్కువగా తిన్నా.. బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక భోజనంలో నూనె, నెయ్యి తగ్గించాలనీ చెబుతున్నారు. కొందరు సలాడ్స్ తింటున్నా.. క్యాలరీలు ఎక్కువగా ఉండే డిప్స్, సాస్ ఉపయోగిస్తుంటారు. అయితే.. వీటివల్ల శరీరంలో క్యాలరీలు పెరిగిపోతాయట. దీంతో బరువు పెరిగిపోతారు.