వెబ్ సిరీస్: బృంద
నటీనటులు: త్రిష, ఇంద్రజిత్ సుకుమారన్,
జయప్రకాశ్, ఆమని
దర్శకత్వం: సూర్య మనోజ్ వంగల
ఓటీటీ: సోనీ లివ్ (ఆగస్టు 2)
Brinda | గ్లామర్‌తోపాటు నటనకు అవకాశం ఉన్న పాత్రలు పోషిస్తూ 20 ఏండ్లుగా ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నది నటి త్రిష. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ వరుస విజయాలతో దూసుకుపోతున్నది. ఆమె తొలిసారిగా నటించిన వెబ్‌సిరీస్ ‘బృంద’ స్ట్రీమింగ్ అవుతున్నది. ఎనిమిది ఎపిసోడ్లుగా ఓటీటీకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..
ఎస్ఐగా విధులు నిర్వరిస్తున్న బృంద (త్రిష)కు అడుగడుగునా అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. మహిళ అనే కారణంగా తోటి పోలీసులు కూడా ఆమెకు అంతగా ప్రాధాన్యం ఇవ్వరు. ఉన్నతాధికారులు కూడా బృంద పనితీరుపై నమ్మకంగా ఉండరు. చిన్నచిన్న కేసులను మాత్రమే ఆమెకు అప్పగిస్తూ ఆఫీసుకే పరిమితం చేస్తుంటారు. ఒకరోజు ఓ దారుణ హత్య వెలుగుచూస్తుంది. ఆ కేసుపై ఉన్నతాధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తారు. దాన్ని ఎలాగైనా పరిష్కరించాలని అనుకుంటుంది బృంద. నేర విచారణలో ఒళ్లు గగుర్పొడిచే ఒక నిజం బయటపడుతుంది.
అధికారులు కూడా షాక్‌కు గురవుతారు. స్పెషల్ టీమ్ ఏర్పాటుచేసి కేసు దర్యాప్తు చేయాలని నిర్ణయిస్తారు. ఆ బాధ్యతలు బృందకు అప్పగిస్తారు. ఆ కేసును ఆమె ఎలా పరిష్కరించింది? బృంద బాల్యమేంటి? ఆమె బాల్యానికీ, ఈ కేసుకూ ఉన్న లింకేంటి? కేసు విచారణలో ఆమెకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి అన్నది మిగిలిన కథ. ఇన్వెస్టిగేషన్లో అక్కడక్కడా లాజిక్‌లు మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఏదేమైనా ఇన్వెస్టిగేషన్, థ్రిల్లర్ జానర్ ఇష్టపడే ప్రేక్షకులను బృంద అలరిస్తుంది.