– రానా నాయుడు-2
– నెట్ఫ్లిక్స్ : స్ట్రీమింగ్ అవుతున్నది
– తారాగణం: విక్టరీ వెంకటేష్, రానా, సుర్వీన్ చావ్లా, రాహుల్ వోహ్రా,
– కృతి ఖర్బందా, అర్జున్ రామ్పాల్, అభిషేక్ బెనర్జీ, సుశాంత్ సింగ్ తదితరులు.
– దర్శకత్వం: సుప్రాణ్ ఎస్ శర్మ, అభయ్ చోప్రా
భారతీయులు కుటుంబానికి అధిక ప్రాధాన్యమిస్తారు. ఉద్యోగం, వ్యాపారం కన్నా.. ఫ్యామిలీ కోసమే ఎక్కువగా కష్టపడుతుంటారు. కుటుంబం బాగుండాలని ఎన్ని బాధలైనా ఓర్చుకుంటారు. అవసరమైతే ప్రాణాలకు కూడా తెగిస్తారు. అలా, తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం యుద్ధానికైనా సిద్ధపడే తండ్రీకొడుకుల కథే.. రానా నాయుడు-2. బోల్డ్ కంటెంట్.. ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా 2023లో ‘నెట్ఫ్లిక్స్’లో సందడి చేసింది రానా నాయుడు మొదటి సీజన్. దానికి కొనసాగింపుగా వచ్చిందే.. రానా నాయుడు-2. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లుగా వచ్చిన ఈ సిరీస్.. ఆద్యంతం ఆకట్టుకునేలా సాగుతుంది.
కథలోకి వెళ్తే.. రానా నాయుడు (రానా) ముంబైలోని సెలెబ్రిటీలు, ధనవంతుల కోసం పనిచేస్తుంటాడు. వారికి వచ్చిన కష్టాల్ని, నష్టాల్ని ఫిక్స్ చేస్తుంటాడు. అయితే.. ఈసారి మాత్రం తన ఫ్యామిలీని ఫిక్స్ చేయాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం తాను పనిచేస్తున్న ఓబీ మహాజన్ (రాజేశ్ జైష్) దగ్గరినుంచి బయటికి వచ్చేయాలని అనుకుంటాడు.
కుటుంబంతో సంతోషంగా గడపాలని ఫిక్స్ అవుతాడు. అంతలోనే ముంబైకి చెందిన పేరుమోసిన గ్యాంగ్స్టర్ రౌఫ్ మీర్జా (అర్జున్ రామ్పాల్) తమ్ముడు సైఫ్.. రానా కొడుకుని కిడ్నాప్ చేస్తాడు. అలాంటి అత్యవసర సమయంలో బిజినెస్ మ్యాగ్నెట్ విరజ్ ఒబెరాయ్ (రాహుల్ వోహ్రా).. రానాకు సాయం చేస్తాడు. కానీ, బదులుగా తనకు ఓ పని చేసి పెట్టాలని షరతు విధిస్తాడు. రానాను మళ్లీ.. తాను వదిలెయ్యాలి అనుకునే ఉచ్చులోకే లాగుతాడు. చేసేది లేక కొడుకు కోసం చివరి పనిగా బరిలోకి దిగుతాడు రానా. ఈ క్రమంలో రానాకు ఎదురైన సవాళ్లు ఏంటి? తనను దెబ్బతీసేందుకు ఒబెరాయ్ కుటుంబం వేసే ఎత్తులు, పైఎత్తుల్లోంచి రానా ఎలా బయటపడతాడు? ఇందులో రానా కుటుంబానికి వచ్చే కష్టాలు ఏంటి? నాగా నాయుడు (వెంకటేష్).. తన కుటుంబానికి ఎలా అండగా నిలబడతాడు? చివరికి రానా తన కుటుంబాన్ని కాపాడుకున్నాడా లేదా? తన పాత్ర ఎలా ముగుస్తుంది? అనేది తెలియాలంటే ‘రానా నాయుడు-2’ చూడాల్సిందే!