చదువుకుంటూనే సీరియల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్న నటి వర్షిణి గౌడ. నటనలో రాణించాలని కలలుగన్న తండ్రి కోరికను తన లక్ష్యంగా మలుచుకుని ఆ దిశగా కష్టపడుతున్నది. చదువుకుంటూనే నటనలోనూ రాణిస్తున్నది. జీ తెలుగులో ప్రసారమవుతున్న ‘జయం’ సీరియల్లో బాక్సర్ గంగ పాత్రలో అలరిస్తున్న కన్నడ చిన్నది వర్షిణి గౌడ జిందగీతో పంచుకున్న కబుర్లు..
నేను పుట్టి, పెరిగిందంతా బెంగళూర్లోనే. మాది సంప్రదాయ కుటుంబం. అమ్మానాన్న చాలా స్ట్రిక్ట్. బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. అమ్మ, నాన్న, నేను, తమ్ముడు. ఇల్లు, స్కూల్, కాలేజ్ తప్ప వేరే ఏ వ్యాపకాలు ఉండేవి కావు. నేను ప్లస్ టూలో ఉన్నప్పుడు ఓ మోడలింగ్ షోలో పాల్గొన్నా. ఆ పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్నా. దాంతో టీచర్స్, ఫెండ్స్ అందరూ మోడలింగ్, యాక్టింగ్‌లో ట్రై చేయమని ప్రోత్సహించారు. దాంతో మోడలింగ్‌లోకి అడుగుపెట్టా. కన్నడ సీరియల్స్, సినిమాలకి ఆడిషన్స్ ఇవ్వడం మొదలుపెట్టా. కలర్స్ కన్నడలో వచ్చిన ‘బృందావన’ సీరియల్లో మొదటి అవకాశం వచ్చింది. రవిచంద్రన్ సర్ సినిమాలోనూ నటించాను, రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నా.
తెలుగు నుంచి అవకాశం వచ్చినప్పుడు భయపడ్డాను. ఎందుకంటే, నాకు తెలుగు అస్సలు రాదు. హైదరాబాద్‌కు ఎప్పుడూ వచ్చింది లేదు. ఇక్కడ ఎలా ఉంటుందో, ఇక్కడివాళ్లు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని భయపడ్డా. కానీ, ఇక్కడికి వచ్చాక కొత్త ప్రాంతానికి వచ్చాననే ఫీలింగ్ కూడా రాలేదు. నన్ను అంత బాగా చూసుకుంటున్నారు. ప్రతి విషయాన్నీ నాకు అర్థమయ్యేలా వివరించి చెబుతున్నారు. కేవలం మూడు నెలల్లోనే తెలుగు అర్థం చేసుకోవడమే కాదు, మాట్లాడటం కూడా నేర్చేసుకున్నా. ఒకప్పుడు హైదరాబాద్ రావడమంటేనే భయపడ్డాను! కానీ, ఇప్పుడు అదే నా రెండో ఇల్లుగా మారిపోయింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల అమ్మాయిగానే ఆదరిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా సీరియల్ గురించే మాట్లాడుతున్నారు.
‘జయం’ సీరియల్ కథ విన్నప్పుడు చాలా కొత్తగా అనిపించింది. సీరియల్ అంటే సాధారణంగా సెంటిమెంట్, ఏడ్వటం వంటి ఎమోషన్స్ ఎక్కువగా ఉండే పాత్ర అనుకుంటాం. కానీ, ఈ సీరియల్లో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. మనం రోజూ చూసే అమ్మాయి పాత్రే అయినప్పటికీ దాంట్లోనూ చాలా క్రియేటివిటీ జోడించి బబ్లీ గర్ల్ క్యారెక్టర్ డిజైన్ చేశారు. ఆ క్రెడిట్ మొత్తం మా డైరెక్టర్ వెంకట్ గారిదే. తెరమీద గంగ పాత్రలో నేను కనిపిస్తున్నా ప్రతి ఫ్రేమ్ వెనక ఆయన హార్డ్‌వర్క్ ఉంటుంది. నటనలోనూ నాకు అంతగా ప్రావీణ్యం లేదు. ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. కన్నడలో ఒకటి రెండు చిన్నచిన్న క్యారెక్టర్స్ చేశాను. ఫుల్ లెన్త్ క్యారెక్టర్ చేయలేదు.
ఆడిషన్స్‌లో కూడా ఒక్కమాట కూడా తెలుగులో చెప్పలేకపోయాను. అయినప్పటికీ నన్ను నమ్మి లీడ్ రోల్లో అవకాశం ఇచ్చిన శ్రీరామ్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. సెట్స్‌లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. సీనియర్ యాక్టర్ ప్రసాద్బాబుగారు జయం సీరియల్లో ఒక పాత్ర చేస్తున్నారు. ఆయన నా నటన చూసి ‘బాగా చేస్తున్నావమ్మా, మంచి భవిష్యత్తు ఉంది’ అన్నారు. ఆ కాంప్లిమెంట్ ఎప్పటికీ మర్చిపోలేను. నిజానికి నేను చాలా సైలెంట్ పర్సన్‌ని, కొత్తవారితో మాట్లాడటానికి అంతగా ఇష్టపడను. కానీ, ఒక్కసారి పరిచయమైతే మాత్రం బాగా మాట్లాడతాను. ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉండదు. ఏ మాత్రం ఖాళీ దొరికినా కుటుంబంతో గడపడానికే ప్రాధాన్యమిస్తా!.
యాక్టింగ్ ఇండస్ట్రీ అంటే తల్లిదండ్రులు వద్దంటారు. కానీ, మా అమ్మానాన్న మొదటి నుంచీ చాలా సపోర్ట్ చేస్తున్నారు. నిజానికి నాన్నకి యాక్టింగ్ అంటే ఇష్టం. ఆయన సినిమాల్లో నటించాలని అనుకున్నారు. కానీ, ఆ కల నెరవేరలేదు. దాంతో నేను యాక్టింగ్‌ని కెరీర్‌గా ఎంచుకుంటానని చెప్పినప్పుడు ఆయన చాలా సంతోషించారు. ఇప్పటికీ నేను లోన్లీగా ఫీల్ అయినా, మూడ్ ఆఫ్‌గా ఉన్నా నాన్నకి ఫోన్ చేస్తాను. ఆయన నన్ను చాలా మోటివేట్ చేస్తారు.
అంతేకాదు, నా నటన చూసి ఫలానా సన్నివేశంలో ఇలా చేస్తే బాగుండేదని వివరిస్తారు. కేవలం నా కుటుంబ ప్రోత్సాహం వల్లే చదువుకుంటూనే నటిగా రాణిస్తున్నా. చిన్నప్పటి నుంచీ డ్యాన్స్ అంటే ఇష్టం. ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు రోజూ స్కూల్ అయిపోగానే వెస్ట్రన్ డ్యాన్స్ క్లాస్‌కి వెళ్లేదాన్ని. కన్నడ నుంచి పలు అవకాశాలు వస్తున్నాయి. కానీ, హైదరాబాద్, బెంగళూర్ మధ్య తిరుగుతూ ఇబ్బందిపడటం ఇష్టం లేక ఒప్పుకోవట్లేదు. మంచి పాత్రలు వస్తే సినిమాల్లోనూ నటించాలని ఉంది. రష్మిక నటన అంటే చాలా ఇష్టం. తక్కువ టైమ్‌లో, కేవలం టాలెంట్‌తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఆవిడే నాకు ఆదర్శం.
-హరిణి..