చిరు ధాన్యాలు నిజంగా సిరి ధాన్యాలే. మన ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. అలాంటి చిరుధాన్యాలతో రకరకాల పదార్థాలు వండుకోవచ్చు. పిల్లలు ఇష్టంగా తినే కుకీలను ఆరోగ్యకరంగా తయారు చేసుకోవచ్చు. ఇకడ మైదా పిండికి బదులు ఊదల పిండి, పంచదారకు బదులు పటిక బెల్లం పొడినీ వాడవచ్చు. ఇలా చేసిన కుకీలు రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం అందిస్తాయి. మరి.. ఈ టేస్టీ కుకీలను ఎలా చేయాలో తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు
గోధుమ పిండి : ఒక కప్పు
ఊదల పిండి : ముప్పావు కప్పు
పటిక బెల్లం పొడి :
ముప్పావు కప్పు
వెన్న : 100 గ్రా.
షుగర్ గ్లేజ్/ గార్నిష్ కోసం..
పటిక బెల్లం పొడి : అరకప్పు
పీనట్ బటర్, చాకొలెట్ గనాష్, కలర్‌ఫుల్ స్ప్రింక్లర్స్ :కొద్దికొద్దిగా..
తయారీ విధానం
ఒక లోతైన గిన్నెలో పటిక బెల్లం పొడిని జల్లెడ పట్టుకోవాలి. వెన్న వేసి బాగా కలపాలి. అందులోనే జల్లెడ పట్టిన గోధుమపిండి, ఊదల పిండి వేసి.. పదార్థాలన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని 30 నిమిషాలపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆ తరువాత పిండిని మరోసారి కలిపి.. వెడల్పాటి ప్లేట్లో వేసి, అప్పడాల కర్రతో దగ్గరికి ఒత్తుకోవాలి. దానిని కుకీల ఆకారంలో కట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసిన ఓవెన్లో పెట్టి.. 170 డిగ్రీల సెల్సియస్ వద్ద 20 – 25 నిమిషాలు కాల్చుకోవాలి. ప్రతి పది నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. బేకింగ్ అయిపోయిన తరువాత కుకీలను పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తరువాత పీనట్ బటర్, షుగర్ గ్లేజ్, స్ప్రింక్లర్స్, డార్ చాకొలెట్ గనాష్తో డెకరేట్ చేసుకుంటే.. రుచికరమైన కుకీలు సిద్ధమైపోయినట్లే! మిల్లెట్స్‌తో చేసిన ఈ కుకీలను ఆ రోజే తినడం మంచిది. పిల్లలకు పాలతో పాటు కలిపి ఇస్తే.. మరీ ఇష్టంగా తింటారు.