‘ప్రేమలో ఉన్నాం’.. అంటారు ప్రేమికులు. ఇంట్లో ఉన్నాం, ఆఫీసులో ఉన్నాం, ట్రిప్‌లో ఉన్నాం.. అన్నట్టుగానే ప్రేమలో ఉండటం అన్నది మరో ప్రపంచంలో ఉండటమే. ఆ ప్రపంచంలో ఉండేది ఇద్దరే. ఈ విశ్వంలో తనూ నేనూ మాత్రమే ఉన్నామన్నంత ఇష్టమున్న ఇద్దరే. మరి కుటుంబమంత బలంగా ఆ బంధం ఉందా.. ఆఫీసులో కెరీర్‌లాగే ధైర్యంగా సాగుతున్నదా.. ట్రిప్ సక్సెస్ఫుల్ అయినట్టే ప్రేమలోనూ సక్సెస్ సాధిస్తున్నారా.. ఎవరైనా ప్రేమ మత్తులో ఉండొచ్చు.. మ్యాజిక్కును లాజిక్ లేకుండా ఎంజాయ్ చేయనూవచ్చు.. కానీ, అందులో విజయం సాధించాలంటే మాత్రం ప్రేమికులు పఠించాల్సిన మంత్రాలు, పాటించాల్సిన సూత్రాలు ఏమిటంటే…
ప్రియమైన వారితో గడిపే కాలం మరపురాని జ్ఞాపకమే. ఆ మధురానుభూతి మనల్ని మళ్లీ వాళ్లతో సమయం గడిపేందుకు ప్రోత్సహిస్తుంది. మనం సంతోషంగా గడిపే ప్రతి సందర్భంలో వాళ్లు పక్కన ఉండాలన్న కోరిక ఉంటుంది. కానీ, నేడు కాలం చాలా విలువైనది. జీవితపు అవసరాలను అందుకోవడానికి ఉరుకులు తీయాల్సిన పరిస్థితి ఉంది. అలాంటప్పుడు మనం కోరుకున్న ప్రతిసారీ పక్కన లేరనో, కాల్ మాట్లాడలేదనో, మెసేజ్ చేయడం మర్చిపోయారనో.. బాధ పడటం, చీటికిమాటికి అలగడం లాంటివి చేయడమంటే ఎదుటి వాళ్లను అర్థం చేసుకోలేక పోతున్నామన్నట్టే. మనసుంటే మార్గం ఉంటుంది అన్న మాట ప్రతిసారీ కుదరదు. కాలేజీలు ఎగ్గొట్టి తిరిగేవాళ్లు, పనీపాటా లేనివాళ్లు మినహాయిస్తే జీవితం పట్ల శ్రద్ధ ఉన్న ఎవరికీ కోరుకున్న ప్రతిసారీ మన పక్కన ఉండటం వీలుపడదు. కాబట్టి ఎంత సమయం మనతో ఉన్నారన్నది కాకుండా, ఎంత ప్రేమగా ఉన్నారన్నదాన్నే లెక్కవేసుకోవాలి. లేకపోతే పక్కన ఉన్న సమయమూ అలకలూ, గొడవలకే వృథా అవుతుంది.
ప్రేమ గుర్తులో హృదయాకారం కనిపిస్తుంది. మెదడు బొమ్మను ఎక్కడా చూడం. నిజమే ప్రేమను మనం అనుభూతి చెందేది హృదయంతోనే. దానికి ప్రతి స్పందించేదీ హృదయంతోనే. ప్రేమకు సంబంధించిన ప్రతి స్పందనా గుండె నుంచే పుడుతుంది. కానీ ఏ భావోద్వేగమైనా అదుపులో ఉండటం చాలా ముఖ్యం. ఆ పని మనసు చేయడం కష్టం. దానికి మెదడు సహాయం తప్పక తీసుకోవాల్సిందే. పట్టరాని ప్రేమ, పట్టరాని కోపం.. ఏదైనా సరే భరించడం ఎదుటివారికి ఇబ్బందిగానే ఉంటుంది. అతి సర్వత్ర వర్జయేత్ అన్న మాట ప్రేమికులకు కూడా వర్తిస్తుందన్నమాట మనసులో పెట్టుకోవాలి. చనువు ఉంది కదా అని ఏ మాట పడితే ఆ మాట మాట్లాడటం, అరవడం
లాంటివి చేస్తే అవతలి వ్యక్తి కొన్ని సందర్భాల్లో తీవ్రంగా నొచ్చుకోవచ్చు. మన ఉద్దేశం ప్రేమించిన వారిని బాధపెట్టడం కానప్పుడు, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం కూడా వాళ్లను ప్రేమించే ఒక విధానమే అవుతుంది. ప్రేమ బహుమతే అవుతుంది.
ఆకాశానికి నిచ్చెన వేయడాలు, చుక్కల్ని తెంపుకొని రావడాలు ప్రేమికులకే సాధ్యం. మన పక్కన ప్రాణానికి ప్రాణమైన తోడు ఉంటే ప్రపంచంలో ఏదైనా సాధ్యమే అన్నంత భరోసా ఉంటుంది. తను నా చేతిలో చెయ్యేసి నడిస్తే ఏదైనా సాధిస్తా అన్న నమ్మకం అతనికి, అతని నీడ నా వెంట ఉన్నా చాలు.. ఎంతటి సవాలునైనా ఎదిరిస్తా అన్న ధైర్యం ఆమెకు జతవుతాయి. ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక పరాజయం పాలైనప్పుడు.. అతనికి ఏం చెప్పాలో, ఆమె ఏం అంటుందో.. అన్న అపనమ్మకం, భయం ఒకరి మీద ఒకరికి ఉండకూడదు. చేసింది తప్పయినా, ఒప్పయినా ఒక స్నేహితుడితో ఎలా పంచుకుంటామో అచ్చం అలా పంచుకోగలిగే చక్కని బంధమే ఇద్దరి మధ్యా పెంపొందించుకోవాలి. ప్రేమను గెలిపించుకోవడానికి కొన్ని సందర్భాల్లో వ్యక్తులుగా దూరమవ్వాల్సిన పరిస్థితులూ రావచ్చు. అలాంటప్పుడు కూడా, ఏం ఫర్వాలేదు నేనున్నాగా అన్న భరోసా ఎదుటి వ్యక్తికి ఇవ్వగలిగితే ‘ట్వెల్త్ ఫెయిల్’ సినిమాలాగే మీ జంటా సూపర్‌హిట్ అవుతుంది.
మీరజాలగలడా నా ఆనతి.. అని సత్యభామ కృష్ణుడి కోసం యుగాలనాడే పాడింది. నా మీద ప్రేమ ఉంటే ఈ పని చేయాల్సిందే అని పట్టుబట్టే వాళ్లు చాలామందే ఉంటారు. సత్య అంటే పురాణ వనిత కాబట్టి ఆ అధికారం వెనుక పరమావధి ఏదో ఉండి ఉంటుంది. కానీ మన సంగతి అలా కాదు. అయినా, ప్రేమకు కట్టుబడ్డాక కట్టప్పలా మారక తప్పని పరిస్థితే… అమ్మాయికైనా అబ్బాయికైనా. అయితే, అవతలి వ్యక్తికి తాను కట్టుబానిసనన్న అనుభవం కలిగించేలా ప్రవర్తిస్తున్నామేమో బేరీజు వేసుకోవాలి. మనిషి స్వేచ్ఛాజీవి. దాన్ని ఎవరి నుంచి ఎవరూ హరించకూడదు. ప్రేమ పేరుతో దానికి సంకెళ్లు వేసే ప్రయత్నం చేయకూడదు. నాకు ఇష్టం కాబట్టి నువ్వు కూడా ఇష్టంగా తినాలి, నాకు ఇలా అనిపించింది కాబట్టి నువ్వు ఇదే నిర్ణయం తీసుకోవాలి.. లాంటి మాటలన్నీ ఆ కోవలోవే. ప్రేమ అధికారంగా కాదు.. అనురాగంగా మాత్రమే అనిపించాలి… అప్పుడు జీవితం కల్యాణి రాగంలా ముచ్చటగా సాగుతుంది.
ప్రియమైన వాళ్లు ఇచ్చిన చాక్లెట్ రేపర్లను భద్రంగా దాచుకునే వారెందరో. నిజంగా ప్రేమ కానుక చాక్లెట్ కన్నా తియ్యనిది. ఏ మిఠాయి రుచికీ అందనిది. అందుకే ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. కానుకలు ఇచ్చుకోవడానికే ఏదో ఒక సందర్భం కోసం ఎదురుచూసే వాళ్లది ప్రేమ జనాభాలో మెజారిటీ సంఖ్యే. అయితే, ప్రేమ ప్రయాణం ఆకర్షణ నుంచి అనుబంధం వైపునకు సాగుతుంటుంది. కొత్తలో ఉన్నంత బహుమతుల ఆలోచన తర్వాత ఉండకపోవచ్చు. అంత మాత్రాన ప్రేమ తగ్గిందని అనుకోకూడదు. మరికొందరిలో ఖరీదైన బహుమతుల మోజు ఉంటుంది. అది ఎంత ప్రియం అయితే, అంతే ప్రేమ చూపించినట్టన్న అంచనాలూ ఉంటాయి. బహుమతులు ‘ప్రియం’ అవడం అన్నది బంధాన్ని భారం చేసుకోవడమే. స్వీట్ అండ్ సింపుల్… అన్ని వేళలా బెటర్!
ప్రేమ అనేది ఒక కెమిస్ట్రీ అంటారు. ఒక రసాయనిక చర్య కనీసం రెండు మూలకాలు కలిసినప్పుడే జరుగుతుంది. ప్రేమకు అలాంటి బలమైన మూలకాలు .. బాధ్యత, గౌరవం. అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ఈ రెండూ ఒకరి పట్ల ఒకరు చూపించినప్పుడే ఆ బంధం బెంజీన్ అంత బలమైన సమ్మేళనంగా రూపాంతరం చెందుతుంది. శాశ్వతంగా నిలిచిపోతుంది… రోజా పువ్వును దాచు
కున్నంత పదిలంగా ఈ సూత్రాలనూ మనసున పదిలపరుచుకున్న జంటకు ప్రతి రోజూ ప్రేమికుల రోజే!